ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తుండగా.. దేశీయ పెట్టుబడిదారుల సహకారంతో స్టాక్ మార్కెట్ తిరిగి వైభవాన్ని సంతరించుకుంది. శనివారం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజెల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు వరుసగా రూ.8, రూ.6 తగ్గించింది. సెంటిమెంట్కు బలం చేకూర్చే దిశగా ఇదో పెద్ద నిర్ణయంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.35వేల కోట్లకు పైగా ఉప సంహరించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం మార్కెట్ కదలికలు ఎలా ఉండొచ్చో పరిశీలిస్తే.. దేశీయ స్టాక్ మార్కెట్ దిశను ఈ వారం ప్రపంచ కార్యకలాపాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) నిర్ణయిస్తాయి. గత కొన్ని సెషన్స్‌లో మార్కెట్లలో చాలా ఒడిదుడుకులు కనిపించాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ ఎకానమీలో మందగమనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ప్రధాన ఆందోళన కలిగించే విషయం.
దీని కారణంగా ఎఫ్‌ఐఐలు విక్రయాల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే దేశీయ ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న మద్దతు కారణంగా భారీ నష్టాల నుంచి సూచీలు తప్పుకుంటున్నాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,532 పాయింట్లు పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నిఫ్టీ 484 పాయింట్లు పెరిగింది. నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల సెటిల్‌మెంట్ కారణంగా ఈ వారం దేశీయ మార్కెట్లలో కొంత ఒడిదొడుకులు తప్పవని తెలుస్తున్నది. గ్లోబల్ ఫ్రంట్‌లో.. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశం వివరాలు 25వ తేదీన వెల్లడిస్తారు. యూఎస్ జీడీపీ అంచనాలు, నిరుద్యోగ గణాంకాలు ప్రపంచ మార్కెట్‌లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..