Saturday, November 23, 2024

Big story : సిల్వర్‌ ఈఈఎఫ్‌లో పెట్టుబడులు లాభదాయకం

దేశంలో బంగారం, వెండి సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. వీటిపై పెట్టుబడులు పెట్టడం కూడా ఓ సంప్రదాయంగా వస్తోంది. మదుపరులు కొంత భాగాన్ని బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. మరి కొంత మంది వెండిపై పెట్టుబడులు పెడుతుంటారు. వెండి పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల వెండికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వెండికి ఉన్న డిమాండ్‌ వల్ల దీన్ని భౌతికంగా కొనుగోలు చేసే బదులు సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటారు. భౌతిక రూపంలోకొనుగోలు చేయడం ద్వారా కొంత రిస్క్‌ ఉంటుంది. తరుగుదల, రంగు పోవడం వంటి కారణాల వల్ల నష్టం జరుగుతుంది. దీని బదులు ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు అన్ని విధాలుగా లాభదాయకమని యాక్సిస్‌ ఏఎంసీ ప్రొడక్ట్స్‌ అండ్‌ ఆల్టర్నేటివ్స్‌ హెడ్‌ అశ్విన్‌ పత్ని అభిప్రాయపడ్డారు.

వెండిని బయోఫార్మా బెడికల్‌ సాంకేతికలు, విద్యుత్‌ ఉత్పత్తి, స్వచ్ఛ ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, మొబిలిటీ సాంకేతికతలలో కూడా ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కారణాల వల్ల సిల్వర్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను మదుపరులు పరిశీలించాలని ఆయన కోరారు. తమ పోర్టుఫోలియోలో వెండి లాంటి అరుదైన లోహం చేర్చడం వల్ల మదుపరులు ప్రయోజనం పొందుతారు. ఇది పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తగ్గిస్తుంది. సిల్వర్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు చక్కటి పోర్ట్‌ఫోలియో డైవర్శిఫికేషన్‌ అవకాశాలను కలిగిస్తాయని ఆయన తెలిపారు.

పారిశ్రామిక వినియోగం పెరగడం వల్ల వెండికి అత్యధిక డిమాండ్‌ ఉంది. వివిధ రంగాల్లో దీన్ని వినియోగించడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. అన్ని లోహాల్లోనూ వెండి అత్యంత అనుకూలమైన ధర్మల్‌ కండక్టర్‌ మాత్రమే కాదు, ఎలక్ట్రికల్‌ కండెక్టివిటీ గా కూడా మెరుగ్గా ఉంటుంది. దీన్ని విస్తృతంగా సోలార్‌ ప్యానెల్స్‌, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌లోఉపయోగిస్తున్నారు. దీని వల్ల వెండికి డిమాండ్‌ పెరుగుతోంది. విద్యుత్‌ వాహనాల్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నందున డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుందని, అందు వల్ల మదుపరులు సిల్వర్‌ లో పెట్టుబడులకు ఉన్న మంచి అవకాశాలను పరిశీలించాలని కోరారు. ముఖ్యంగా వీటిని దీర్ఘకాలపు పెట్టుబడులుగా చూడాలని ఆయన కోరారు. ఆర్థిక అనిశ్చితి కాలంలో పెట్టుబడులకు స్వర్గధామంగా వెండి నిలుస్తుంది. ఎందుకంటే ఇది ద్రవ్యోల్బణానికి విరుగుడుగా పని చేస్తుంది. ధరల కదలికల ప్రభావం దీనిపై చూపదని అశ్విన్‌ పత్ని వివరించారు. భౌతిక, రాజకీయ భయాలు నెలకొన్న సమయంలోనూ ఇది విలువను ఇస్తుంది.

సిల్వర్‌ ఈటీఎఫ్‌లు మదుపరులకు ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయని ఆయన చెప్పారు. వీటిని ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ చేడంతో పాటు స్టాక్స్‌లా ట్రేడ్‌ చేయవచ్చన్నారు. ఈటీఎఫ్‌ ఫండ్స్‌లో మార్కెట్‌ పని చేసే కాలంలో ఎప్పుడైనా సరే వాస్తవ ధరలతో లావాదేవీలు నిర్వహించవచ్చని చెప్పారు. మదుపరులు వెండిని భౌతికంగా నిల్వ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. దీని వల్ల ప్రమాదం తగ్గడంతో పాటు, నిల్వ ఖర్చు కూడా తగ్గుతుంది. సిల్వర్‌ ఈటీఎఫ్‌లతో మదుపరులు వెండి నాణ్యత, స్వచ్ఛతకు భరోసా ఉంటుంది. ఈటీఎఫ్‌లకు వెండిలో ఫిజికల్‌ హోల్డింగ్స్‌ మద్దతు ఇస్తాయని ఆయన చెప్పారు. వెండిలో రాబడులు పొందాలని భావించే మదుపరులు సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన సూచించారు. రిస్క్‌లను కూడా పరిగణలోకి తీసుకుని పెట్టుబడులు పెడితే మంచిదని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement