Monday, November 18, 2024

RBI | వడ్డీ రేట్లు యథాతథం.. యూపీఐ చెల్లింపుల పరిమితి రూ.5లక్షలకు పెంపు

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాస్‌ పేర్కొన్నారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువలో ఒడుదొడుకులు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా దాస్‌ మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పట్టనుందని చెప్పారు.

- Advertisement -

ఓ వైపు అప్పులు పెరగడం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఒకింత బలహీనంగా ఉందన్నారు. దేశఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2023-24 మూడో త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం ఉండొచ్చని తెలిపింది. ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యం 4శాతానికి చేరుకోవావల్సి ఉందని పేర్కొంది.

వృద్ధిరేటు అంచనాలు పెంపు

2023-24లో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. మూడో త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5శాతం, 6.4 శాతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

2023 డిసెంబర్‌ 1నాటికి భారత విదేశీ మారక నిల్వలు 604 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని ఆర్‌బీఐ రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచింది. రికరింగ్‌ చెల్లింపుల ఈ-మ్యాండేట్‌ పరిమితిని రూ.15 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
లోన్‌ అగ్రిగేటర్లకు మార్గదర్శకాలు

డిజిటల్‌ రుణాలపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. రుణ ఉత్పత్తులను అందించే లోన్‌ అగ్రిగేటర్ల కోసం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఇందుకోసం ఫిన్‌ టెక్‌ రిపాజిటరీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ వంటి ఆర్థిక సంస్థలు ఫిన్‌టెక్‌ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఆధ్వర్యంలో రిపాజిటరీని 2024 ఏప్రిల్‌ లేదా అంతకంటే ముందే తీసుకురానున్నట్లు చెప్పారు. ఆయా ఫిన్‌టెక్‌ సంస్థలు సంబంధిత సమాచారాన్ని రిపాజిటరీకి అందించాల్సి ఉంటుందన్నారు.

రుణాలపై రిస్క్‌వెయిటేజీ పెంపు

బ్యాంకింగ్‌ రంగంలో రుణాలపై గత కొంతకాలంగా దృష్టి సారించింది. వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాల విషయంలో రిస్క్‌ వెయిట్‌ను పెంచుతూ ఇటీవల ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఆ మేర మూలధనాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎటువంటి తాకట్టూ అవసరం లేకుండా తీసుకునే అన్‌ సెక్యూర్డ్‌ రుణాలు పెరుగుతున్న వేళ ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఈ రిస్క్‌ వెయిట్‌ పెంపు గురించి మాట్లాడుతూ.. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోలేం కదా’ అని శక్తికాంత దాస్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement