- ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో మీరూ తెలుసుకోండి
భారతదేశం నుండి విదేశాలకు వెళ్తున్నప్పుడు మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమా లేదా అనేది మీరు విదేశీ ట్రిప్ కోసం ఏ దేశానికి అయితే వెళ్తున్నారో ఆ దేశంలో అమలవుతున్న పాలసీలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది అన్ని దేశాల్లోనూ తప్పనిసరి కానప్పటికీ, దాదాపుగా 38 దేశాలు దీన్ని చట్టబద్ధం చేసి, ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి.
ముఖ్యంగా సందర్శకులకు తగిన భద్రత ఉండేలా చూడటానికి, అలాగే ఆ దేశంలోని వైద్యారోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఆయా దేశాలు ఈ ఆదేశాలను అమలు చేస్తున్నాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసిన దేశాలు, అది లేకుండా ప్రయాణించడం వల్ల ఎదుర్కోవాల్సిన పరిణామాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చదవండి.
తప్పనిసరిగా ఉండాల్సిన ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ఏదైనా దేశం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసినప్పుడు, ఆ దేశంలో అడుగుపెట్టడానికి లేదా వీసాకు అప్లై చేయడానికి ఆ దేశ చట్టాల ప్రకారం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు తలెత్తడం, విమానాలు ఆలస్యమవ్వడం లేదా ఆలస్యమయ్యే పరిస్థితులు తలెత్తడం, సామాను/పాస్‌పోర్ట్ పోవడం, ఆస్తి నష్టం లేదా శరీరానికి గాయాలవ్వడం వంటి వాటిని కవర్ చేసేటప్పుడు సాధారణ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలాంటి ప్రయోజనాలను కల్పిస్తుందో, ఈ తప్పనిసరిగా ఉండాల్సిన పాలసీలు కూడా అవే ప్రయోజనాలను అందిస్తాయి.
అయితే, కొన్ని దేశాలు ప్రయాణీకులకు తప్పనిసరిగా ఉండాల్సిన ఇన్సూరెన్స్‌పై కొన్ని అదనపు నిబంధనలను విధించాయి. ఉదాహరణకు, మీరు నిర్దిష్ట కనీస కాల వ్యవధికి కనీస కవరేజీ విలువ ఉన్న పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా, కొన్ని దేశాల్లో సాహస కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు లేదా కరోనా వంటి మహమ్మారి లేదా అంతర్యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం.
కొన్నిసార్లు, ఈ ఆదేశాలు తాత్కాలికమైనవి. ఉదాహరణకు, కొవిడ్-19 మహమ్మారి ప్రబలంగా ఉన్న సమయంలో సింగపూర్, భూటాన్ వంటి దేశాలకు వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా కొవిడ్-19 కవరేజీ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాల్సి వచ్చేది. అయితే, మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చాలా చోట్ల అలాంటి ఆంక్షలను ఎత్తివేశారు.
దేశాలు పర్యాటకులకు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు తప్పనిసరి చేస్తాయి?
- పర్యాటకులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి: పర్యాటకులపై ఆర్థికంగా ఎక్కువ భారం పడకుండా, వెంటనే వైద్య సహాయం అందేలా చూడటానికి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను దేశాలు తప్పనిసరి చేస్తాయి. మందులతో పాటు, ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులకు ఇన్సూరెన్స్ ఉంటే అది మీ ప్రాణాలను కాపాడవచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ-నిధులతో నడిచే ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు లేని దేశాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.
- స్థానిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు ఆర్థిక నష్టాలను తగ్గించడానికి: ట్రావెల్ ఇన్సూరెన్స్ లేని పర్యాటకులు ఆ దేశంలో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైతే, వారికి వైద్య సంరక్షణ అందించడానికి అయ్యే ఖర్చును స్థానిక ఆరోగ్య సంరక్షణ సంస్థలే భరించాలి. దీని వల్ల ప్రజారోగ్య సంరక్షణ ఉన్న దేశాల్లోని స్థానిక పన్ను చెల్లింపుదారులపై అధిక ఆర్థిక భారం పడవచ్చు.
- ప్రజా భద్రత, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి: ఒక పర్యాటకుడు వైద్య సహాయం పొందకపోతే, ముఖ్యంగా అంటు వ్యాధులు వంటివి ప్రబలుతున్న సందర్భాల్లోనూ చికిత్స తీసుకోకపోతే, ఆ పర్యాటకుని వల్ల స్థానికులకూ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే, మీరు ఆర్థిక ప్రభావం గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే సహాయం పొందేందుకు ఉపయోగపడుతుంది, అలాగే మీతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసాగా నిలుస్తుంది.
- ప్రభుత్వంపై భారాన్ని తగ్గించడానికి: ప్రకృతి వైపరీత్యాలు, అంతర్యుద్ధం, యుద్ధాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో, స్థానిక ప్రభుత్వాలు ప్రతిసారీ పర్యాటకుల కోసం ప్రజాధనాన్ని వెచ్చించడానికి ఇష్టపడకపోవచ్చు. అయితే, మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే వైద్య సహాయం, అత్యవసర రవాణా, అక్కడి నుండి వేరే చోటకి తరలించడానికి అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తుంది, కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
- ఇబ్బందుల్లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి: మీరు విహార యాత్రకు వేరే దేశం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు, తీరా అక్కడికెళ్లాక ఆరోగ్య అత్యవసర పరిస్థితులు నెలకొనడం, విమానం ఆలస్యం కావడం లేదా లగేజీ దొంగతనానికి గురి కావడం వల్ల మీరు అదనపు ఖర్చులను భరించాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, మీరు పూర్తిగా నిరుత్సాహానికి గురవుతారు. ఇది మీ ప్రయాణ అనుభవాన్ని నాశనం చేస్తుంది, భవిష్యత్తులో మరెప్పుడూ ఆ దేశానికి వెళ్లకూడదని భావిస్తారు. అదే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నిశ్చింతగా నిద్రపోవచ్చు, ఎందుకంటే ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఇన్సూరెన్స్ కవరేజీ ఉండటం వల్ల మీకు భరోసా లభిస్తుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసిన దేశాలు
అనేక దేశాలు భారతీయ ప్రయాణీకులకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేశాయి. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, కొవిడ్-19 చికిత్స లేదా వేరే చోటుకు తరలించడానికి కవరేజీ ఉండాలని తరచూ స్పష్టం చేస్తాయి. క్యూబా, ఈక్వెడార్ (గాలాపాగోస్ కోసం), అరుబా, జోర్డాన్, నేపాల్ (ట్రెక్కింగ్/పర్వత అధిరోహణ), వియత్నాం, ఇరాన్, లావోస్, ఖతార్, రువాండా, సీషెల్స్ వంటివి ముఖ్యమైన ఉదాహరణలు.
షెంగెన్ దేశాలకు కనీసం €30,000 (దాదాపుగా ₹26.74 లక్షలు) కవరేజీ అవసరం, అయితే రష్యా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (మల్టిపుల్-ఎంట్రీ వీసాలు), సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (విద్యార్థులకు) కూడా నిర్దిష్ట నిబంధనలను విధించాయి. అంటార్కిటికా వంటి మారుమూల ప్రాంతాలలో, కాంప్రెహెన్సివ్ మెడికల్ ఎవాక్యుయేషన్ (సమగ్ర వైద్య తరలింపు) కవరేజీ అవసరం. మీ ట్రిప్‌ను ప్లాన్ చేయడానికి ముందు ఎంబసీలను సంప్రదించి లేదా అధికారిక వెబ్‌సైట్లలో అప్‌డేట్ చేసిన నిబంధనలను ఎల్లప్పుడూ చెక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పుడు, అది లేకపోతే కలిగే పరిణామాలు
- ప్రవేశ నిరాకరణ: ట్రావెల్ ఇన్సూరెన్స్ లేని ప్రయాణీకులకు ప్రవేశాన్ని నిలిపివేయవచ్చు. వీసాకు అప్లై చేసిన దశలోనే ఇన్సూరెన్స్ తప్పనిసరి అయిన సందర్భంలో వీసాను తిరస్కరిస్తారు.
- చట్టపరమైన జరిమానాలు: ప్రయాణీకులు ఇన్సూరెన్స్ నిబంధనలను పాటించలేదనే కారణంతో, ఆ దేశ స్థానిక చట్టాల ప్రకారం జరిమానాలు లేదా ఇతర చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవచ్చు.
- ఆర్థిక ఒత్తిడి: ఇన్సూరెన్స్ లేని ప్రయాణీకులు కొత్త ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం లేదా రిటర్న్ ఫ్లైట్ బుక్ చేయడం వంటి తక్షణ ఆర్థిక భారాలను భరించాల్సి రావచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ లేదా వస్తువులు పోయిన సందర్భాల్లో ఖర్చులు మరింతగా పెరుగుతాయి.
- ప్రయాణంలో అంతరాయాలు: తప్పనిసరి చేసిన ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రయాణీకులు వారి ప్రణాళికకు తగినట్లుగా ప్రయాణించలేకపోవచ్చు, అంటే వసతి, రవాణా లేదా యాక్టివిటీలను రీషెడ్యూల్ చేయాల్సి రావచ్చు, దీని వల్ల ఒత్తిడి, అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చివరిగా చెప్పేదేంటంటే, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసిన దేశాలను సందర్శించేటప్పుడు మీరు ముందుగానే పాలసీని తీసుకోండి. మీ పాలసీ కవరేజీ అమౌంట్, కాలవ్యవధి, వర్తించే అంశాల పరిధి అనేవి స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. ఇబ్బందుల్లేని అనుభవం కోసం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి, మేనేజ్ చేయడానికి ఫోన్‌పే వంటి విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకోండి. అవాంతరాలు లేని ప్రక్రియలు, సమగ్ర కవరేజీ ఉండటం వల్ల మీరు పూర్తి విశ్వాసంతో ప్రయాణించవచ్చు, అంతే గాక మీ ప్రయాణాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టవచ్చు.