ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసే విధానాన్ని అనుమతించలేమని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు లేఖ రాసింది. కంపెనీ నిబంధనలకు ఇది విరుద్ధమని స్పష్టం చేసింది. ఉద్యోగాల్లోకి తీసుకునే సమయంలో ఇచ్చే ఆఫర్ లేటర్‌లోనే ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపామని గుర్తు చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించినవారిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. అదనపు ఆదాయం కోసం ఏమైనా చేయాలంటే కంపెనీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది.
నిబంధనలకు లోబడి అవసరం అనుకుంటే, ఉద్యోగి అభ్యర్ధన పరిశీలించి ప్రత్యేక అనుమతి ఇస్తామని తెలిపింది. ఇలా ఇచ్చే అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం కంపెనీకి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసే విధానం మూన్‌లైటింగ్‌పై ఇటీవల ఎక్కువ చర్చ జరుగుతోంది. ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉండే ఐటీ పరిశ్రమలో దీనికి ప్రాముఖ్యత పెరిగింది. నైపుణ్యం ఉన్న ఉ ద్యోగులకు డిమాండ్ ఉన్నందున, అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయంలో మరో పని చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా ఇటీవల మూన్‌లైటింగ్ విధానంపై ప్రతికూలంగా స్పందించారు.
ఆన్‌లైన్ ఫుడ్ యాప్ స్విగ్గీ తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులు విధులు ముగించుకున్న తరువాత ఇతర సమయాల్లో తాత్కాలికంగా మరో ఉద్యోగం, పని చేసేందుకు వీలు కల్పించింది. స్విగ్గీ నిర్ణయం తరువాతే దీనిపై ఎక్కువ చర్చ జరుగుతోంది.
ఇన్ఫోసిస్ నిర్ణయాన్ని లాభాపేక్ష లేని సంస్థ నైట్స్ తప్పుపట్టింది. ఉద్యోగులు కేవలం 9 గంటలు మాత్రమే పని చేసేలా కంపెనీతో ఒప్పందం ఉంటుందని గుర్తు చేసింది. పనివేళల ముగిసిన తరువాత ఉద్యోగులు ఏం చేయాలనేది వారి ఇష్టమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం ప్రతి పౌరుడికీ జీవనోపాధిని పొందే హక్కు ఉంటుందని పేర్కొంది. ఉద్యోగులకు ఇలాంటి లేఖలు పంపించడం చట్టవిరుద్ధమని , అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ఫోసిస్ నిర్ణయం కోర్టు ముందు నిలవదని స్పష్టం చేసింది. ఉద్యోగులు పని చేసే సమయానికే వేతనాలు ఇస్తున్నాయి. చాలా మంది ఉద్యోగులు తమకు ఉన్న ఖాళీ సమయాల్లో ఇతర ఉద్యోగాలు, లేకుంటే పనులు చేస్తుంటారని పరిశ్రమ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.
మూన్‌లైటింగ్ అంటే..
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తాజా హెచ్చరికతో మూన్‌లైటింగ్‌పై మరోసారి చర్చకు దారి సింది. ఒక ఉద్యోగి తాను పని చేసే సంస్థలో సమయం తరువాత మిగిలిన సమయాల్లో రెండో ఉద్యోగం, పని చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. అదనపు ఆదాయం కోసం కొంత మంది రాత్రి సమయాల్లో, వారాంతంలో పని చేస్తుంటారు. జులై లో ఓ సంస్థ వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఒక సర్వే చేసింది. వారిలో 65 శాతం మంది రెండో ఉద్యోగం గురించి తెలుసని చెప్పారు. చాలా మంది వర్క్‌ఫ్రమ్ హోం నుంచి ఆఫీస్‌లకు వచ్చి పని చేయడానికి ఇష్టపడకపోవడానికి మూన్‌లైటింగ్ కూడా ఒక కారణమన్న అంచనా వుంది. మన దేశంలో ఇలా బయట పడింది రెండు సంవత్సరాలుగా మూన్‌లైటింగ్ ఐటీ సంస్థలకు సమస్యగా మారింది. రెండో ఉద్యోగం చేసే ప్రతిభ ఉన్న ఉద్యోగుల నుంచి ఉత్పాదకత తగ్గడం వంటి సమస్యలను ఐటీ కంపెనీలు ఎదుర్కొన్నాయి.
బెంగళూర్‌లో ఓ వ్యక్తి ఏడు సంస్థలకు పని చేస్తున్నట్లు కొంతకాలం క్రితం బయటపడింది. ఆ ఉద్యోగికి ఉన్న పలు పీఎఫ్ ఖాతాల ఆధారంగా దీన్ని గుర్తించారు. ముంబాయిలో ఒక ప్రముఖ కంపెనీ ఐటీ హెడ్ ఆఫీస్‌లో విధులకు హాజరయ్యేందుకు అంగీకరించలేదు. చివరకు అతని మెయిల్స్‌పై నిఘా పెట్టడంతో అతను మరో ఉద్యోగం చేస్తూ, డేటాను ఆ కంపెనీకి పంపిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇలా మన దేశంలో తొలుత బయటపడిన ఈ రెండు సంఘటనలే మూన్‌లైటింగ్ గా భావిస్తున్నారు.
మూన్‌లైటింగ్ విధానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ గట్టిగా వ్యతిరేకించారు. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ సమర్ధించారు. ఉద్యోగం అనేది ఉద్యోగి, కంపెనీ మధ్య ప్రతి రోజు కొన్ని గంటల కాంట్రాక్ట్‌గా ఆయన పేర్కొన్నారు. దీని తరువాత ఉద్యోగి ఇష్టమని చెప్పారు. మానవ వనరుల విభాగ న్యాయ నిపుణులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఫుల్‌టైమ్ ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఉద్యోగి రెండో ఉద్యోగం చేయకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు. రెండు ఉద్యోగాలు చేస్తే ఒక చోట రహస్యాలు మరో చోటకు చేరే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇది మోసం కిందకు వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 60 ప్రకారం రెండు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించారు. ఈ నిబంధన నుంచి ఐటీ సంస్థలకు మినహాయించారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం కూడా బహుళ ఉద్యోగాలు చేయడంపై నిషేధం ఉంది. ఇలాంటి పట్టుబడితే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది.