వినియోగదారుల ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో 7 శాతం లోపుగానే ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 4-6 శాతం లోపుగా ఉండాలని ఆర్బీఐ పెట్టుకున్న లక్ష్యానికి మించి మూడు సంవత్సరాలుగా నమోదవుతోంది. సెప్టెంబర్ నెలలో ఇది 7.4 శాతంగా నమోదైంది. ఆర్బీఐ పెట్టుకున్న అప్పర్ సీలింగ్ 6 శాతంగా ఉందని శనివారం నాడు ఆయన లీడర్‌షిప్ సమ్మిట్ 2022లో మాట్లాడుతూ చెప్పారు. అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం నాడు విడుదల అవుతాయని, ఈ సారి ద్రవ్యోల్బణం 7 శాతం లోపుగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు మెరుగుపడినందున ఊహించిన దానికంటే ముందుగానే గ్లోబల్ ద్రవ్యోల్బణం నెమ్మదించనుందని శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ద్రవ్యోల్బణన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడంలేదు. ఈ వైఫల్యంపై నవంబర్ 3న ద్రవ్య విధాన కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించి దీనిపై చర్చించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ఎదురైన వైఫల్యాల గురించి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక సమర్పించింది. నియంత్రణలో ఎదురైన వైఫల్యం గురించి ప్రభుత్వానికి వివరింగా తెలియచేశామని చెప్పారు. దీనిపై తాను కూడా పలు మార్లు ఇప్పటికే వివరించినట్లు తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో 4 శాతానికి తీసుకురావాలని ద్రవ్య విధాన కమిటీకి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు.
కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను పెంచలేదని ఆయన వివరించారు. ఈ సమయంలో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 వరకు ఉందన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకు వచ్చేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందన్నారు. సంక్షోభ పరిస్థితులు, షాక్‌లను ఎదుర్కొవడానికి తగినంత సమయం లభిస్తుందని ఆయన చెప్పారు.
రుపాయి మరింత బలహీనపడకుండా నిరోధించేందుకు ఆర్బీఐ పలు మార్లు జోక్యం చేసుకుందని ఆయన వివరించారు. ఇందు కోసం 100 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభం తరువాత రూపాయి పతనం ఎక్కువగా జరిగిందన్నారు. ఇందుకోసం ఆర్బీఐ విదేశీ మారక నిల్వలను విచ్ఛలవిడిగా ఖర్చు చేసిందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. వర్షం వచ్చినప్పుడే గొడుగు ఎలా పట్టుకుంటామో మార్కెట్‌లో అవసరమైన సమయంలోనే రూపాయి పతనాన్ని నిలువరించేందుకు డాలర్లను ఖర్చు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగంలో ఆవిష్కరణలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.