Friday, November 22, 2024

దివ్యాంగున్ని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది.. రూ.5లక్షలు ఫైన్‌ వేసిన డీజీసీఏ..

న్యూఢిల్లి : ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) రూ.5లక్షల జరిమానా విధించింది. మే 7న రాంచీ ఎయిర్‌పోర్టులో తన తల్లిదండ్రులతో ఓ దివ్యాంగ చిన్నారిని విమానంలోకి ఎక్కించుకోవడానికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నిరాకరించింది. ఈ ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణంగా స్పందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది సందర్భానికి తగినట్టు వ్యవహరించడంలో విఫలం అయ్యారని, పౌర విమానయాన నిబంధనల స్ఫూర్తికి విరుద్ధంగా వారు నడుచుకున్నారని ఆరోపించింది. సంబంధిత నియమ, నిబంధనల మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.5లక్షల జరిమానా విధించామని డీజీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

రాంచీలో చేదు అనుభవం..

వారం క్రితం ఓ కుటుంబం హైదరాబాద్‌ వచ్చేందుకు రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అందులో ఓ దివ్యాంగ బాలుడు ఉండటంతో.. విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిరాకరించింది. ఈ పిల్లాడిని ఎక్కిస్తే.. మిగిలిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారనే కారణం తెలియజేసింది. దీంతో ఇతర ప్రయాణికులు, బాలుడి కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చేసేదేమీ లేక.. చిన్నారిని తీసుకుని ఆ కుటుంబం తిరుగు ప్రయాణం అయ్యింది. సిబ్బంది ప్రవర్తన కారణంగా ప్రయాణం రద్దు చేసుకుంది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో తోటి ప్రయాణికులు పోస్టు చేయగా.. పౌర విమానాయన మంత్రిత్వ శాఖతో పాటు డీజీసీఏ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement