దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాడు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచే లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే దూకుడు ప్రదర్శించాయి. దీంతో సెన్సెక్స్ 52 వారాల గరిష్టానికి చేరింది. ఈ ఒక్క రోజే మదుపర్ల సంపద ఈ ఒక్క రోజే 3.6 లక్షల కోట్లు పెరిగింది. అమర్కెట్ల దూకుడుకు ప్రధానంగా దోహదం చేసిన అంశాల్లో అమెరికా ద్రవ్యోల్బణం ఒకటి. వరసగా నాలుగోనెల కూడా అమెరికా ద్రవ్యోల్బణం తగ్గింది.
అక్టోబర్‌లో అంచనాల కంటే తక్కువగా 7.7 శాతం నమోదైంది. ఇది ప్రపంచ మార్కెట్లలో ఉత్సహం నింపింది. ఫలితంగా అన్ని మార్కెట్లు గరిష్ట లాభాలను ఆర్జించాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల విషయంలో దూకుడుగా ఉండకపోవచ్చని అంచనాతో మార్కెట్లకు మంచి ఊపు వచ్చింది.
మరో వైపు ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుండటంతో డాలర్‌కు క్రమంగా డిమాండ్ తగ్గుతోంది. రూపాయి బలం పుంజుకుంటోంది. మన దేశ మార్కెట్లు రాణిస్తుండటంతో క్రమంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. నవంబర్‌లో ఇప్పటి వరకు ఎఫ్‌ఐఐలు 19 వేల కోట్ల విలువ చేసే ఈక్విటీలను కొనుగోలు చేశారు. సెన్సెక్స్ 1181.34 పాయింట్లు లాభంతో 61795.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 321.50 పాయింట్ల లాభంతో 18349.70 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 230రూపాయలు పెరిగి 52339 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 88 రూపాయలు తగ్గి 61823 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.37 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లీ ఇండియా, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతి సుజుకీ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
ఎంఅండ్ ఎం, ఎస్‌బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి.