భారత వృద్ధిరేటు అంచనాలను ఈ ఏడాది మరోసారి మూడీస్ తగ్గించింది. ఈ సంవత్సరం మే నెలలో వృద్ధిరేటును 8.8 శాతం ఉంటుందని పేర్కొన్న మూడీస్ సెప్టెంబర్‌లో దాన్ని 7.7 శాతానికి సవరించింది. తాజాగా ఇప్పుడు దాన్ని 7 శాతానికి కుదించింది. మే నెల అంచనాలతో పోల్చితే భారత వృద్ధిరేటును మూడీస్ 1.8 శాతం మేర తగ్గించింది. 2023లో భారత వృద్ధిరేటు మరింత తగ్గి 4.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2024 నాటికి కొంత పుంజుకుని అది 6.4 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.
కొవిడ్ పరిణామాల నుంచి కొలుకుంటున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ప్రపంచ వృద్ధి నెమ్మదించడం వల్ల అవరోధాలు ఏర్పడవచ్చని మూడీస్ వివరించింది. ఆర్ధిక వ్యవస్థలో తీవ్ర అస్థిరత, సుదీర్ఘంగా కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాలను కఠినతరం చేయడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్లలోని ఒడుదొడుకులు ప్రపంచ వృద్ధిరేటుకు కూడా విఘాతం కలిగించనున్నట్లు మూడీస్ తెలిపింది.