Friday, November 22, 2024

2047 నాటికి అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ దేశంగా ఇండియా

మన దేశం 2047 నాటికి అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ దేశంగా మారుతుందని ఈఏసీ పీఎం ఛైర్మన్‌ బిబేక్‌ దేబ్‌రాయ్‌ చెప్పారు. వచ్చే 25 సంవత్సరాలు సంవత్సరానికి 7 నుంచి 7.5 శాతం వృద్ధిరేటును కొనసాగించితే ఇది సాధ్యమేనన్నారు. ఇదే వృద్ధిరేటు కొనసాగితే 2047 నాటికి దేశం 20 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. ప్రస్తతం మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఆరోవదిగా ఉంది. ప్రస్తుతం మన దేశ జీడీపీ 2.7 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరిలో ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని ప్రధాన మంత్రి ఎకనమిక్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (ఈఏసీ-పీఎం) ఛైర్మన్‌ బిబేక్‌ దేబ్‌రాయ్‌ చెప్పారు.
అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ దేశంగా మారడం అంటే పూర్తి ధనవంతులుగా మారడం కాదని, ఇప్పుడున్న స్థితి నుంచి సగటు ఆదాయాలు పెరగడం ద్వారా ఎగువ మధ్యతరగతి ప్రజలుగా ఎక్కువ మంది మారడమని ఆయన వివరించారు. మన సమాజ స్వభావం పూర్తిగా మారిపోతుందన్నారు. ప్రపంచ బ్యాంక్‌ లెక్క ప్రకారం తలసరి ఆదాయం 12 వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే ధనిక దేశంగా పిలుస్తారని చెప్పారు.

రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రకారం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.4 శాతం వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటని ఐఎంఎఫ్‌ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశమంటే ఆర్థికాభివృద్ధి అధికంగా ఉండటం, తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటడం, జీవన ప్రమాణాలు ఉన్నతస్థాయిలో ఉండాలి. హ్యుమెన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ బాగుండాలి. విద్య, వైద్యం ఉన్నత స్థితిలో ఉండాలి. అప్పుడే అది అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. మన దేశం ఈ దిశగానే వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో మన దేశ జీడీపీ 2.5 లక్షల కోట్లు ఉంటే ప్రస్తుతం అది 150 లక్షల కోట్లుగా ఉందని చెప్పారు. వృద్ధిరేటు ఇలానే కొనసాగితే మన దేశం అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ దేశంగా మారుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement