భారత్‌పై కెనడా మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది. భారత్ దౌత్యవేత్తలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నోట్ పంపడంతో భారత్ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నది. కెనడా ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న భారత్.. అక్కడి దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కెనడాలోని భారత హైకమిషనర్‌తో పాటు దౌత్య సిబ్బంది భారత్‌కు తిరిగి వస్తున్నారు. కెనడాలో దౌత్య సిబ్బందికి రక్షణ లేదని, అందుకే వెనక్కి పిలిపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కెనడాలోని భారత దౌత్యవేత్తలను అనుమానితులుగా కెనడా ప్రభుత్వం పేర్కొనడంపై భారత ప్రభుత్వం సీరియస్ అయ్యింది. భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు నిజ్జర్ హత్య దర్యాప్తుతో ముడిపడి ఉన్న వ్యక్తులు అని కెనడా చేసిన అభియోగాలపై భారత ప్రభుత్వం తీవ్రమైన పదజాలంతో ఖండన ప్రకటనను విడుదల చేసింది.
కెనడా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యాలని, అపరాధమైనవని భారత్ పేర్కొన్నది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని కెనడా దౌత్యాధికారికి భారత్ తేల్చి చెప్పింది. ట్రుడో ప్రభుత్వం రాజకీయ లబ్ధి కేసం భారత్‌పై దుమ్మెత్తి పోస్తున్నందున.. ప్రతిస్పందనగా తదుపరి చర్యలు తీసుకునే హక్కు ఇప్పుుడు తమకున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.