Tuesday, November 26, 2024

5జీకి పెరుగుతున్న డిమాండ్‌.. ఈ ఏడాది చివరికల్లా 3 కోట్ల యూజర్లు

దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను టెలికం సంస్థలు భారీగా విస్తరిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ తమ సర్వీస్‌లను ప్రారంభించాయి. 5జీ పొందిన మరో టెలికం సంస్థ వోడాఫోన్‌ ఐడియా నిధుల లేమితో ఇంకా భారీ స్థాయిలో ఈ నెట్‌వర్క్‌ను విస్తరించే కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. 5జీ నెట్‌వర్క్‌ విస్తరణలో జియో ముందుంది. అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలతో పాటు, ముఖ్యమైన ప్రాంతాల్లోనూ 5జీ కవరేజీ ఇస్తోంది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 80 లక్షల నుంచి కోటీ మంది వరకు 5జీ యూజర్లు 5జీ ఫోన్లను వినియోగిస్తున్నట్లు ఎరిక్‌సన్‌ అంచనా వేసింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య 3 కోట్లకు చేరుతుందని పేర్కొంది. 5జీ సర్వీస్‌ల వినియోగంపై ఎరిక్‌సన్‌ అంతర్జాతీయ సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. భారత్‌లో ఎక్కువ మంది యూజర్లు 5జీ డేటాను హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్‌, వీడియో కాలింగ్‌, మొబైల్‌ గేమ్‌లు ఆడేందుకు ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ సర్వీస్‌ల కోసం ఉపయోగిస్తున్నారని నివేదికలో పేర్కొంది.

అమెరికా, బ్రిటన్‌, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలతో పోల్చితే భారత్‌ యూజర్లు వారంలో రెండు గంటలు ఎక్కువగా 5జీ సర్వీస్‌లను ఉపయోగిస్తున్నారని నివేదికలో పేర్కొంది. భారతీయ యూజర్లలో 15 శాతం మంది యాప్‌ వినియోగం, వీడియో స్ట్రీమింగ్‌, గేమింగ్‌, మ్యూజిక్‌ వంటి సర్వీస్‌లతో కూడిన 5జీ డేటా ప్లాన్లకు ప్రస్తుత ధర కంటే 14 శాతం ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని సర్వే తెలిపింది.

- Advertisement -

భారత్‌లో గత అక్టోబర్‌లో 5 జీ సర్వీస్‌లు

ప్రారంభించారు. అప్పటి నుంచి రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ మధ్యే 5జీ సర్వీసులకు సంబంధించి ప్రధాన పోటీ నెలకొంది. ఈ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లతో యూజర్లకు 5జీ డేటాను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ వేగం కూడా గణనీయంగా పెరిగిన ట్లు ఇంటర్నెట్‌ టెస్టింగ్‌ కంపెనీ ఊక్లా ప్రకటించింది.

తాజాగా నిర్వహించిన 5జీ ఇంటర్నెట్‌ స్పీడ్‌ టెస్ట్‌లో జపాన్‌ 58వ స్థానం, బ్రిటన్‌ 62వ స్థానం, బ్రెజిల్‌ 50వ స్థానంలో ఉన్నాయి. భారత్‌ వీటన్నింటికంటే ముందు మెరుగైన స్థితిలో 47వ స్థానంలో ఉంది. గతంలో మన దేశం 72వ స్థానంలో ఉంది. భవిష్యత్‌లో భారత్‌లో మరింత వేగవంతమైన 5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయని ఎరిక్‌సన్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement