Sunday, November 17, 2024

Imports | పప్పులపై దిగుమతి సుంకం మినహాయింపు.. 2025 వరకు పొడిగించిన కేంద్రం

దేశంలో పప్పుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం వీటి దిగుమతులపై సుంకాలను మినహాయింపును పొడిగించింది. ప్రధానంగా మినపప్పు, కంది పప్పుల దిగుమతులపై దిగుమతి సుంకాలను 2025 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2021 అక్టోబర్‌ నుంచి ఈ రెండు పప్పుల దిగుమతులపై సుంకాలను ప్రభుత్వం మినహాయించింది.

నవంబర్‌ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో ఇది 6.61 శాతంగా ఉంది. నవంబర్‌లో పప్పుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంలో 20 శాతం వీటి వాటాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎర్ర కందిపప్పు దిగుమతులపై కూడా సుంకాల మినహాయింపును 2025 మార్చి వరకు పొడిగించింది. ప్రధానమంత్రి గరిబ్‌ కళ్యాణ్‌ యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 2028 వరకు పొడిగించింది. ఈ స్కీమ్‌ కింద ఆహార ధాన్యాలను రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల చొప్పున ఉచితంగా ఇస్తారు.

- Advertisement -

దేశీయంగా పప్పు ధాన్యాల దిగుబడి తగ్గిపోవడంతో వీటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలే శనగ పప్పు ధరలు కొంత మేర తగ్గాయి. నవంబర్‌లో కేజీ 156.5 రూపాయలు ఉంటే, డిసెంబర్‌ నాటికి 154 రూపాయలకు తగ్గింది. ఈ సంవత్సరం జనవరిలో శనగపప్పు, కందిపప్పు, మినపప్పులపై దిగుమతి సుంకాలను 2024 మార్చి 31 వరకు మినహాయిస్తు నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ మినహాయింపును 2025 మార్చి 31 వరకు పొడిగించింది. 2022-23 సీజన్‌లో కందిపప్పు దిగుబడులు 3.31 మిలియన్‌ టన్నులుగా ఉంటే, 2023 ఖరీప్‌లో ఇది 3.22-3.27 మిలియన్‌ టన్నుల వరకే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది.

ఉత్పత్తి తగ్గడం మూలంగా పప్పుల రేట్లు పెరుగుతాయని భావించిన ప్రభుత్వం వీటిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా దిగుమతి సుంకాలను మినహాయించారు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గితే, ప్రధాన ద్రవ్యోల్బణం కొంత మేర తగ్గుతుందని ఆర్ధిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో పప్పు ధాన్యాల సాగును పెంచడంతో పాటు, వాటిని సరైన గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో, పాటు చీడపీడల బెడద మూలంగా రైతులు వీటిని సాగు చేసేందుకు ముందుకు రావడంలేదు. చాలా ప్రాంతాల్లో రైతులు వీటి స్థానంలో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తిని సాగుచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement