సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ విషయాన్ని గుర్తెరిగి విమానాశ్రయాల్లో అనవసరపు హంగులు చేయక్కర్లేదు. ప్రయాణ ఖర్చులు సామాన్యులకు అందుబాటులోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిమిత వ్యయంతోనే చేపట్టాలని సూచించింది. విమానయాన రంగంలో అత్యంత కీలకమైన వాటాదారులు సాధారణ ప్రయాణీకులేనని పేర్కొంది.
ఈ క్రమంలోనే ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని ఇతర విమానాశ్రయాలతో పోలిస్తే భారత్‌లో చార్జీలు సరసమైన పోటీతత్వంతో కూడి ఉండాలని సూచించింది.’పిటిషన్ ప్రేయింగ్ ఫర్ మోడ్రనైజేషన్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ బై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ పేరిట రాజ్యసభ ఎంపీ సుజిత్ కుమార్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఓ నివేదికను రూపొందించింది. దానిని రాజ్యసభకు సమర్పించింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాల ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనను తక్కువ ఖర్చుతో సమర్థంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. ఇందుకోసం సాంకేతికత సాయం తీసుకోవాలని సూచించింది.
‘భారత్ ఒక అభివృద్ధి చెందుతోన్న దేశం. పౌరులకు ప్రయాణ ఖర్చులపై పట్టింపు ఉంటుంది. చాలా మంది కేవలం రాకపోకలకే విమానాశ్రయాలను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సేవలకు ఇచ్చినంత ప్రాముఖ్యాన్ని ఇతర అనవసర హంగులకు ఇవ్వకూడదు. ప్రయాణికుల సౌకర్యవంతమైన, సులభతరమైన సేవలను అందించేందుకు వృథా ఖర్చులు అనవసరం. ప్రైవేట్ ఆపరేటర్లు విమానాశ్రయాల్లో అనవసర హంగులను నివారించాలి. మరోవైపు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పనకు విమానయాన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలి’ అని ప్యానెల్ పేర్కొంది.