Friday, November 22, 2024

త్వరలో ఐడీబీఐ వాటాల విక్రయం.. దీపం కార్యదర్శి వెల్లడి

ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్‌పరం చేసే పనిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో సర్కారీ బ్యాంక్‌ను ప్రైవేటీకరించడానికి సిద్ధమవుతున్నది. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాలను అమ్మే పనిలోనే ఉన్నామని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి తుహన్‌ కాంత పాండే తెలిపారు. ఎల్‌ఐసీ ఐపీవో వివరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాండే మాట్లాడుతూ రోడ్‌షో పూర్తయిన తర్వాత బ్యాంక్‌లో ఎంత పరిమాణంలో వాటాను విక్రయించాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్‌లో ప్రభుత్వానికి 45.48 శాతం వాటా, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉన్నది. ఈ క్రమంలోనే మొత్తం వాటాను ఒకేసారి అమ్మేయాలా లేక దశలవారీగా విక్రయించాలా అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పాండే చెప్పారు.

మదుపరుల స్పందనపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. గత ఏడాది మేలో ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా బదిలీకి, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ మేరకు ఐడీబీఐ బ్యాంక్‌ చట్టంలో కావాల్సిన సవరణల్ని ఆర్థిక చట్టం 2021 ద్వారా పూర్తిచేసిన కేంద్రం లావాదేవీ సలహాదారులను కూడా నియమించేసింది. ఎల్‌ఐసీకి మెజారిటీ వాటాను ఇప్పటికే అమ్ముకోగా, 2019 జనవరి 21 నుంచి ఎల్‌ఐసీ అనుబంధ సంస్థగా ఐడీబీఐ బ్యాంక్‌ కొనసాగుతున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement