దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ మోటార్స్ గ్రూప్ ఇండియాలో హ్యుండాయ్‌తో పాటు, కియా బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. ఈ రెండు బ్రాండ్స్ కలిసి 2023లో కంపెనీ 15 లక్షల వాహనాలను విక్రయించింది. హ్యుండాయ్ ఇండియా తన ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా పెంచాలని నిర్ణయించింది.
దీంతో పాటు ఇండియన్ మార్కెట్‌లో మరిన్ని విద్యుత్ వాహనాలను తీసుకురానుంది. హ్యుండాయ్ మోటార్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్ యుసున్ చుంగ్ ఈ నెల 23న భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలు, మార్కెట్ వ్యూహాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
భారత్‌లో గ్రూప్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. కియా, హ్యుండాయ్ తయారీ ప్లాంట్ల సామర్ధ్యాన్ని సంవత్సరానికి 15 లక్షల యూనిట్లకు పెంచనున్నారు. గత సంవత్సరం జనరల్ మోటార్స్ నుంచి కొనుగోలు చేసిన పుణే ప్లాంట్‌లో గత సంవత్సరం ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను కంపెనీ మరింతగా ఆధునీకరిస్తోంది.
ఇక్కడి నుంచి 2 లక్షల యూనిట్లును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెన్నయ్ ప్లాంట్‌లో సంవత్సరానికి 8,24,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తోంది. పుణే ప్లాంట్‌తో కూడా కలిపితే ఉత్పత్తి సామర్ధ్యం సంవత్సరానికి 10 లక్షలకు పైగా ఉంటుంది. ఈ సంవత్సరం దీనికి అదనంగా మరో 4,31,000 యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలని కంపెనీ నిర్ణయించింది.
మొత్తం హ్యుండాయ్ గ్రూప్ ఇండియాలో సంవత్సరానికి 15 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉందని తెలిపింది. భారత్‌లో విద్యుత్ వాహనాల మోడల్స్‌ను పెంచాలని హ్యుండాయ్ నిర్ణయించింది. వీటితో పాటు ఎస్‌యూవీ వాహనాలను పెంచనుంది.
కంపెనీ వచ్చే సంవత్సరం పూర్తిగా భారత్‌లో తయారైన విద్యుత్ కారును తీసుకురానుంది. 2024 చివరి నాటికి హ్యుండాయ్ తన మొదటి ఎస్‌యూవీ మోడల్ విద్యుత్ కారును భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనుంది. 2030 నాటికి కంపెనీ 5 ఈవీ మోడల్స్‌ను తీసుకురానుంది.