హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆసియా పసిఫిక్ ప్రాంతంలో(అపాక్) టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా హైదరాబాద్ నగరం నిలిచింది. గ్లోబల్ టాలెంట్, అందుబాటులో ఉన్న రియల్ ఎస్టేట్, వ్యాపారానకూల వాతావరణం ఇవన్నీ కలగలిసి హైదరాబాద్ నగరంలో ఉన్నాయని కుష్‌మన్ అండ్ వీకీఫీల్డ్ కన్సల్టెన్సీ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. దేశంలో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కలకత్తా నగరాలు కూడా అందుబాటులో ఉన్న టాలెంట్, రియల్ ఎస్టేట్, వ్యాపారానుకూల అంశాల్లో ముందు వరుసలో ఉన్నాయని కన్సల్టెన్సీ తెలిపింది. అభివృద్ధి చెందిన పొరుగు దేశం చైనా రాజధాని బీజింగ్ నగరం తర్వాత హైదరాబాద్ టెక్నాలజీ హబ్‌గా నిలవడం గర్వకారణమని రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2లక్షల 30వేల 813 టెక్ ఉద్యోగాల కల్పనతో దేశంలోనే బెంగళూరు నెంబర్ వన్‌గా నిలవగా లక్షా 3 వేల 32 ఉద్యోగాలతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది.
చెన్నై హైదరాబాద్ కంటే కేవలం 9 వేల ఉద్యోగాలు అధికంగా కల్పించింది. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఢిల్లి నిలిచింది. ఐటీతో పాటు టెక్ రంగాలే దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తులుగా పనిచేస్తున్నాయని కుష్‌మన్ సంస్థ తెలిపింది. కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసికట్టుగా తీసుకువస్తున్న వ్యాపారనుకూల పాలసీల వల్ల రానున్న రాజోల్లో హైదరాబాద్ నగరంతో పాటు మిగిలిన 3 టెక్ నగరాల్లో మరిన్ని ఉద్యోగాల కల్పన జరగనుందని నివేదికలో కుష్‌మన్ పేర్కొంది.