కరోనా కారణంగా వాహన రంగాన్ని సెమీ కండక్టర్ కొరత తీవ్రంగా వేధించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతున్నదన్న సమయంలోనే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వాహన రంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ యుద్ధం కారణంగా భారతీయ వాహన పరిశ్రమపై కూడా పడినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫడా) ప్రకటించింది. మార్కెట్‌లో వాహనాల కొనుగోళ్లకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ.. సెమీ కండక్టర్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉందని చెప్పుకొచ్చింది. వినియోగదారుడు తనకు నచ్చిన వాహనం కోసం బుక్ చేసుకుంటే.. కొన్ని నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి దేశీయ మార్కెట్‌లో నెలకొంది. సెమీ కండక్టర్ల కొరత కారణంగా.. డెలివరీలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయని ఫడా అధ్యక్షుడు వింకేశ్ గులాటీ అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రభావం ప్యాసింజర్ వాహనాలపై పడిందని తెలిపారు. దేశంలో ప్రయాణికుల రిటైల్ వాహన విక్రయాలు మార్చిలో 4.87 శాతం మేర క్షీణించినట్టు వివరించారు. 2,71,358 యూనిట్లకు చేరుకుందని చెప్పుకొచ్చారు. గతేడాది మార్చి నెలలో 2,85,240 యూనిట్లను విక్రయించినట్టు తెలిపారు.
చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు..
చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడ్డాయి. దిగుమతులు నిలిచిపోయాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో పాటు చైనాలో విధించిన లాక్‌డౌన్ పరిస్థితులు.. సెమీ కండక్టర్ల కొరతను మరింత తీవ్రతరం చేశాయని ఫడా అభిప్రాయపడింది. సెమీ కండక్టర్లు అనుకున్న సమయానికి దిగుమతి కాకపోతుండటంతో.. వాహన డెలివరీలు కూడా నిలిచిపోయాయని వివరించింది. టూ వీలర్, త్రీ వీలర్‌తో పాటు కమర్షియల్ వాహన విక్రయాలు మార్చిలో ఇలా ఉన్నాయి. ద్విచక్ర వాహన విక్రయాలు క్రితం ఏడాదితో పోలిస్తే.. 4.02 శాతం తగ్గిందని వివరించింది. 2022 మార్చిలో 11,57,681 యూనిట్లు విక్రయించగా.. గతేడాది మార్చిలో 12,06,191 యూనిట్లు విక్రయించినట్టు తెలిపింది. అయితే దీనికి ప్రధాన కారణం ఉందని వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ తగ్గడంతోనే.. అనుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయినట్టు ఫడా తెలిపింది. తాజాగా ఇంధన ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో వాహన విక్రయాలు మరింత పడిపోయాయని గులాటీ చెప్పుకొచ్చారు.
కమర్షియల్ సేల్స్ 15 శాతం జంప్..
ఇక కమర్షియల్ వాహనాల విషయానికొస్తే.. భిన్నమైన పరిస్థితే నెలకొంది. ద్వి చక్ర వాహనాల కంటే మెరుగ్గా కమర్షియల్ వాహనాలు 2022 మార్చిలో అమ్ముడు పోయాయి. 2021, మార్చిలో 67,828 యూనిట్ల కమర్షియల్ వాహనాలు విక్రయించారు. 2022లో ఏకంగా 77,938 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది మార్చితో పోలిస్తే.. 14.94 శాతం అధికం. ఇక త్రీ వీలర్ వాహనాల అమ్మకాలు గమనిస్తే.. కమర్షియల్ వాహనాలకంటే మెరుగ్గా అమ్మకాలు కొనసాగాయి. 2022 మార్చిలో 48,284 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది మార్చిలో కేవలం 38,135 యూనిట్లు మాత్రమే విక్రయించారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 26.61 శాతం త్రీ వీలర్ అమ్మకాల్లో వృద్ధి కనిపించింది. ఇక అన్ని రకాల వాహనాలు కలుపుకుంటే.. వాహన విక్రయాలు 2.87 శాతం తగ్గాయి. గతేడాది మార్చిలో 16,66,996 యూనిట్లు విక్రయించగా.. ఈ ఏడాది మార్చిలో కేవలం 16,19,181 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..