ఈ ఆర్ధిక సంవత్సరం మన దేశంలోకి 2023-24లో సోలార్ ప్యానల్ దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో సోలార్ ప్యానల్స్ దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ దిగుమతుల విలువ 1,136,28 మిలియన్ డాలర్లకు చేరాయి. 2022-23 మొత్తం ఆర్ధిక సంవత్సరంలో వీటి దిగుమతులు 943.53 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్ధిక సంవత్సరం మొత్తం దిగుమతుల కంటే ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో జరిగిన దిగుమతులు ఎక్కువగా ఉన్నాయని రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది.
దిగుమతులు భారీగా పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయని ఇక్రా కార్పోరేట్ రేటింగ్స్ కో-గ్రూప్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ తెలిపారు. ఆమోదించబడిన నమూనాలు, తయారీదారుల జాబితా (ఎఎల్‌ఎంఎం) కింద ఉనన ప్రాజెక్ట్‌ల కోసం నేరుగా దిగుమతి చేసుకున్న మాడ్యూల్స్‌ను ఉపయోగించడంపై ప్రభుత్వం పరిమితులు విధించింది. సోలార్ మాడ్యూళ్లను దేశీయ సంస్థల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. 2023 మార్చి నుంచి డెవలపర్‌లు నేరుగా మాడ్యూళ్లను దిగుమతి చేసుకునే ఆర్డర్లను 2024 మార్చి వరకు ప్రభుత్వం నిలిపివేసింది.
దిగుమతులు పెరిగేందుకు మరో కారణం సోలార్ మాడ్యూల్స్, సెల్ ధరలు గణనీయంగా తగ్గడంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దిగుమతులు గణనీయంగా పెరిగాయని విక్రమ్ అభిప్రాయపడ్డారు. 2024 మార్చి తరువాత కూడా దిగుమతులు కొనసాగుతాయని, అయితే అవి కేవలం సోలార్ సెల్స్‌కు పరిమితం అయ్యే అకాశం ఉందని తెలిపారు. సోలార్ మాడ్యూళ్లను మాత్రం దేశీయంగానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలోకి సోలార్ మాడ్యూళ్ల దిగుమతులు 2.6 గిగా వాట్లుగా ఉంది.
2023-24 ఆర్ధిక సంవత్సరంలో అక్టోబర్ వరకు ఇది 8.9 గిగావాట్లుగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా మాడ్యూళ్లు దేశీయంగా లభించే అవకాశం తక్కువగా ఉందని, వీటిని దిగుమతి చేసుకోక తప్పదని ఎన్రాన్స్ కన్సల్టెంగ్ సంస్థ డైరెక్టర్ రవి శంకర్ అభిప్రాయపడ్డారు. 2025-26 సంవత్సరం నాటికి ఏర్పాటు కానున్న సోలార్ పవర్ యూనిట్లకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయానికి 18.9 గిగావాట్ల సామర్ధ్యం కావాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి గణనీయంగా పెరిగితే తప్పదాన్ని సాధించడం సాధ్యం కాదని తెలిపారు.
దిగుమతుల విలువ తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా చైనాతో పాటు వియత్నాం, మలేషియా, థాయిలాండ్, హ్యాంగ్‌కాంగ్ నుంచి కూడా సోలార్ మాడ్యూల్స్ దిగుమతులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. మన దేశానికి 2023-24 ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో చైనా తరువాత ఎక్కువగా వియత్నాం నుంచి 455.8 మిలియన్ డాలర్లు, హంగ్‌కాంగ్ నుంచి 121.82 మిలియన్ డాలర్ల విలువైన మాడ్యూళ్లు వచ్చాయి. మలేషియా నుంచి 43.08 మిలియన్ డాలర్ల విలువైన మాడ్యూళ్లు మన దేశానికి దిగుమతి అయ్యాయి. చైనా నుంచి అత్యధికంగా 499.98 మిలియన్ డాలర్ల విలువైన మాడ్యూళ్లు దిగుమతి అయ్యాయి. మలేషియా నుంచి 264.19 మిలియన్ డాలర్ల విలువైన మాడ్యూళ్లు దిగుమతి అయ్యాయి.