దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్-అక్టోబర్ పండగల సీజన్‌లో శామ్‌సంగ్ ఇండియా 14,400 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను విక్రయించింది. జులై-సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 13 అమ్మకాలు అత్యధికంగా జరిగాయి. ప్రీమియం స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో ఐఫోన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రికార్డ్ స్థాయిలో 5జీ ఫోన్ల అమ్మకాలు జరిగాయని శామ్‌సంగ్ సీనియర్ డైరెక్టర్ అదిత్య బర్బర్ తెలిపారు. ప్రీమియం కేటగిరిలో కంపెనీ 99 శాతం వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు.
ఈ పండుగ సీజన్‌లో కేవలం 60 రోజుల్లోనే 14,400 కోట్ల రూపాయల విలువైన ఫోన్లను కంపెనీ విక్రయించిందని ఆయన వెల్లడించారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే రెట్టింపు అమ్మకాలు జరిగాయన్నారు. శామ్‌సంగ్ ప్లస్ ఫైనాన్స్ వల్ల ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగేందుకు దోహదం చేసిందన్నారు. గత సంవత్సరంతో పోల్చితే కంపెనీ ఆదాయం 20 శాతం మేర వృద్ధి చెందిందని బబ్బర్ తెలిపారు. రెవెన్యూ పరంగా శామ్‌సంగ్ కంపెనీ 22 శాతం మార్కెట్ వాటా కలిగి ఉందన్నారు. కస్టమర్లు
ఎక్కువ మంది 5జీ ప్రీమియం ఫోన్ల కొనుగోలు చేశారని తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌కు సపోర్టు చేసే 20 ఫోన్లను కంపెనీ విక్రయిస్తుందని చెప్పారు. 5జీ ఫోన్లకు నవంబర్ 15 నాటికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తామని ఆయన తెలిపారు.
ప్రీమియం ఫోన్లలో ఐఫోన్ దేశంలో మొదటిసారి ఐ ఫోన్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 69,900 రూపాయలతో ప్రారంభమయ్యే ఐఫోన్ 13 అమ్మకాలు జులై-సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. మన దేశ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో నెంబర్1 స్థానం సాధించిన మొదటి ఐఫోన్‌గా ఇది నిలిచిందని అనలిటిక్స్ సంస్థ కౌంటర్ పాయింట్ తన నివేదికలో పేర్కొంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగంలో యాపిల్ 40 శాతం మార్కెట్ వాటా పొందింది.
గత సంవత్సరంతో పోల్చితే సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల సరఫరా 11 శాతం తగ్గి 4.5 కోట్లుకు పరిమితమైంది. ప్రస్తుతం మన దేశ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో చైనా కంపెనీ షియోమీ అగ్రస్థానంలో ఉంది. 20 వేల లోపు ధర ఉండే 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయంలో షియోమీ అగ్రస్థానంలో ఉంది. శామ్‌సంగ్ ఫీచర్, స్మార్ట్‌ఫోన్ల విభాగంతో కలిపి 18 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. వన్ ప్లస్ సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు 35 శాతం పెరిగాయి.
ప్ర ధానంగా నార్డ్ సీఈ2, నార్డ్ 2టీ మోడళ్ల అమ్మకాలు ఈ వృద్ధికి కారణంగా నిలిచాయి. వన్‌ప్లస్ ప్రీమియం ఫోన్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. 5జీ స్మార్ట్ ఫోన్ల విభాగంలో రెండో అతి పెద్ద కంపెనీగా నిలిచింది. మన దేశ మార్కెట్‌లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో జులై-సెప్టెంబర్ కాలానికి ఎంఐ 21 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో 18శాతం మార్కెట్ వాటాతో శామ్‌సంగ్ నిలిచింది. మరో చైనా కంపెనీ వివో 14 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానంలోనూ, 14 శాతం వాటాతో రియల్‌మి 4వ స్థానంలో నిలిచింది. ఒప్పో 10 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. ఇతర ఫోన్ బ్రాండ్లు అన్ని కలిపి 22 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి.