Sunday, November 17, 2024

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు.. త్వరలో రాష్ట్రానికి ఆస్ట్రేలియా బృందం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆస్ట్రేలియా ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో లీసా సింగ్‌ గురువారంనాడు ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆస్ట్రేలియాలోని వ్యాపార వాణిజ్య వర్గాల సంబంధాలను బలోపేతంపై ఇరువురు చర్చించారు. దేశంలో అత్యంత వేగంగా వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని, తెలంగాణతో ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ రంగాలలో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, రెన్యువబుల్‌ ఎనర్జీలాంటి రంగాల్లో అనేక అవకాశాలుఉన్నాయని, వీటిలో ఆస్ట్రేలియాలో ఉన్న పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులపై ఆశావహంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ఆమె తెలిపారు. భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి అనేక నూతన ఒప్పందాలపై చర్చ నడుస్తున్న సందర్భంగా త్వరలోనే ఒక ప్రతినిధి బృందం ఇక్కడి పెట్టుబడి అవకాశాలపైన పరిశీలన చేసేందుకు పర్యటించనున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఆమె తెలిపారు.

తాము ఇప్పటికే తెలంగాణలోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తున్న విషయాన్ని తెలిపిన లీసా సింగ్‌, వి.హబ్‌ తమ భాగస్వామి అని వివరించారు. తెలంగాణ, ఆస్ట్రేలియా దేశాల మధ్య పెట్టుబడులకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆయా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ లీసా సింగ్‌కు తెలిపారు. భారతదేశంలోని విధి విధానాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వానికి కొంతవరకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉంటుందని, ఇలాంటి నేపథ్యంలో ప్రగతిశీల తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆస్ట్రేలియాలోని పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్‌, లీసాకు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement