దేశంలోని 8 ప్రధాన నగరాల్లో వార్షిక ప్రాతిపదికన సగటున 11 శాతం ఇళ్ల ధరలు పెరిగాయి. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో ఢిల్లి-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు అత్యధికంగా 32 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ సంఘం క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లియాసెస్ ఫోరాస్ సంయుక్తంగా మూడో త్రైమాసికానికి సంబంధించి హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్టును విడుదల చేశాయి.
ప్రధాన నగరాలైన ఢిల్లి ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూర్, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నయ్, కోల్‌కతా, పుణే నగరాల్లో ఇళ్ల ధరలను పరిగణనలోకి తీసకుని ఈ నివేదికను రూపొందించారు. ఈ నగరాల్లో వార్షిక ప్రాతిపదికన సగటున ఇళ్ల ధరలు 11 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.
2021 నుంచి వరసగా 15వ త్రైమాసికంలోనూ ఇళ్ల పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. ఢిల్లిలో అత్యధికంగా 32 శాతం పెరిగి, చదరపు అడుగు సగటు ధర 11,438 రూపాయలకు చేరింది. బెంగళూర్‌లో చదరపు అడుగు ధర 9,471 నుంచి 11,743 రూపాయలకు పెరిగినట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో 10 లక్షల ఇళ్లు విక్రయం కావాల్సి ఉందని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 40 శాతం ఇళ్లు అమ్ముడు కావాల్సి ఉంది. హైదరాఆద్‌లో అమ్ముడు కావాల్సిన ఇళ్లు 28 శాతం ఉన్నాయి. వార్షిక ప్రతిపాదికన మాత్రం ఇది తగ్గుతున్నాయని నివేదిక తెలిపింది.