Saturday, November 23, 2024

పండుగతో భారీగా బంగారం అమ్మకాలు.. రేటు 56 వేలకు చేరుతుందని అంచనా

దీపావళి పర్వదినం, ధన త్రేయోదశితో ఈ సీజన్‌లో బంగారం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల కోవిడ్‌ తరువాత మార్కెట్‌లో ఈ స్థాయిలో బంగారం అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. ధన త్రేయోదశి సందర్భంగా 40వేల కోట్ల మేర బంగారం అమ్మకాలు జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను భారీగా పెంచడంతో అంతర్జాతీయ బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీని వల్ల కొనుగోళ్లుకు మంచి ప్రోత్సహం లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. దేశీయ మార్కెట్‌లో బంగారం అమ్మకాలు మాత్రం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయని ట్రేడర్స్‌ చెబుతున్నారు. ఆదివారం ఉదయం 10 గ్రాముల బంగారం ధర 51,290 రూపాయలుగా ఉంది. ఇది శనివారం ధరతో పోల్చితే 10 రూపాయలు అదనం.

- Advertisement -

ఈ సంవత్సరం ధన త్రేయోదశికి ఎక్కువ మంది షాపులకు వచ్చి బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ సారి వివాహాలు కూడా ఎక్కువగా ఉండటంతో బంగారానికి డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉందని కేడియా అడ్వైజరీ డైరెక్టర్‌ అజయ్‌ కేడియా అభిప్రాయపడ్డారు. ఒక సంవత్సర కాలంలో బంగారం ధర 10 గ్రాములకు 56 వేలకు పైగా పెరిగే అవకాశం ఉందని కూడా ట్రేడర్స్‌ అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది . ఆదివారం నాడు ఢిల్లిd, ముంబై, చెన్నయ్‌ మార్కెట్లలో కేజీ వెండి 57,700 రూపాయలుగా ఉంది.

అమెరికా వడ్డీరేట్లు మరోసారి పెంచనుందని వస్తున్న వార్తల వల్ల బంగారం రేట్లలో కరెక్షన్‌ వచ్చే అవకాశం ఉందని అజయ్‌ కేడియా చెప్పారు. అక్టోబర్‌ 22వ తేదీన బంగారం 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 47 వేలుగా ఉంటే, 24 క్యారెట్స్‌ బంగారం ధర 51,280 రూపాయలు ఉంది. ఇది క్రితం రోజుకంటే వరసగా 750,830 రూపాయలు పెరిగింది. అమెరికాతో పాటు, అనేక దేశాల వడ్డీరేట్లను పెంచుతున్నందున అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం రేట్లు తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో టోరీ ఔన్స్‌ బంగారం ధర 2,085 డాలర్ల నుంచి 1620 డాలర్లకు తగ్గింది. ప్రస్తుతం టోరి ఔన్స్‌ ధర 1655 డాలర్లుగా ఉంది. వడ్డీ రేట్లు పెరగడంతో అమెరికా బాండ్స్‌ రాబడి బాగా పెరగడంతో బంగారం రేటుపై ప్రభావం పడుతుందని వారు చెబుతున్నారు. మన దేశ మార్కెట్‌లో మాత్రం సమీప కాలంలో బంగారం పది గ్రాముల ధర 49,500 కంటే దిగువకు వచ్చే అవకాశంలేదని వారు స్పష్టం చేస్తున్నారు.

దేశీయంగా అధిక ద్రవ్యోల్బణం ఉన్నా కొనుగోలుదారులు మాత్రం బంగారం కొనుగోలు పట్ల ఆసక్తిగా ఉన్నారని వ్యాపారుల సమాఖ్య కాయిట్‌ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్తియా చెప్పారు. సాధారణంగా ధన త్రయోదశి నాడు బంగారం, వెండి ధరలు బాగా పెరుగుతాయని, ఈ సారి మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గడం కలిసి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ సారి బంగారం, వెండితో చేసిన దేవతామూర్తుల విగ్రహాల కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయిని ఆలిండియా జెమ్‌ అండ్‌ జ్యూవెల్లరీ దేశీయ మండలి ఛైర్మన్‌ అశిష్‌ పెథె చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనై గత సంవత్సరం కంటే ఈ సారి 20 శాతం అమ్మకాలు ఎక్కువ జరిగాయని ట్రేడర్స్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement