ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వరసగా రెండో త్రైమాసికంలోనూ భారీ నష్టాలు వచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) భారత్ ఆయిల్ కార్పోరేషన్ (బీపీసీఎల్) హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్(హెచ్‌పీసీఎల్) కంపెనీలకు జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో 21,270 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ఈ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న ఖర్చు కంటే అమ్మకం రేట్లు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. దేశంలో ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ప్రభుత్వం చాలా కాలంగా రోజువారి పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ కాలంలో మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు 18,480 కోట్ల మేర నష్టాలు వచ్చాయి.
రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ఈ మూడు కంపెనీలు ఈ నెల చివరలోకాని, నవంబర్ మొదటివారంలోకాని వెల్లడించనున్నాయి.
అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా చమురు కంపెనీలు దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలను సమరిస్తుంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు వీటి రేట్లను ఆరు నెలలుగా సవరించడంలేదు. రెండో త్రైమాసికంలో లీటర్ పెట్రోల్‌పై 9.8 రూపాయలు నష్టం వచ్చింది. ఐఓసీకి 6,300 కోట్లు, బీపీసీఎల్‌కు 6,900 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు 8,100 కోట్లు నష్టాలు వచ్చాయని ఐసీఐసీఐ సెక్యూరిటీ స్ అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ 1995.3 కోట్లు నష్టం వచ్చినట్లు జులై 29 న ప్రకటించింది. హెచ్‌పీసీఎల్‌కు 10,196.94 కోట్లు, బీపీసీఎల్‌కు 6,290.8 కోట్లు నష్టాలు వచ్చాయని ప్రకటించాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వ రంగ సంస్థలు 137 రోజుల పాటు రేట్లను సవరించలేదు.