అమెరికా ఫెడ్ రేట్ల ప్రభావం మన మార్కెట్లపైనా, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరసగా నాలుగు రోజులుగా రూపాయి పతనం కొనసాగుతోంది. సోమవారం నాడు రూపాయి జీవితకాలపు కనిష్టానికి దిగజారింది. మరో వైపు డాలర్‌తో బ్రిటీష్ పౌండ్ విలువ కూడా క్షిణించింది. ట్రేడింగ్‌లో డాలర్ ఇండెక్స్ మరింత బలపడింది. డాలర్ ఇండెక్స్ 0.46 శాతం బలపడి 113.71 శాతానికి పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్రితం ముగింపుతో పోల్చుకుంటే 58 పైసలు క్షిణించి 81.67 రూపాయల వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్, విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో రూపాయిపై ఒత్తిడి పెరగడానికి దోహదం చేశాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో డాలర్‌తో రూపాయి 81.47 వద్ద ప్రారంభమైంది. చివరకు 81.67 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 82 రూపాయలు టచ్ చేసింది.
రూపాయి విలువ మరింత క్షిణించకుండా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ద్వారా రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించే అవకాశం ఉందని ఫోరెక్స్ ట్రేడర్స్ భావిస్తున్నారు. 2023 వరకు రూపాయి విలువ మరింతగా క్షణించి 82 రూపాయలకుపైగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం పశ్చిమ దేశాల ఆంక్షలు ప్రపంచాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. రష్యాపై ఆంక్షల మూలంగా సప్లయ్ చైయిన్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ జోక్యం చేసుకున్నప్పటికీ వచ్చే 6 నుంచి 8 నెలల పాటు రూపాయి విలువలో క్షిణత కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ఆర్ధికవేత్త ఒకరు స్పష్టం చేశారు. ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు వేగంగా క్షిణించడం మరింత ఆందోళనకర పరిస్థితికి దారితీస్తుందని భావిస్తున్నారు.
ఇతర కరెన్సీలతో పోల్చితే మన రూపాయి విలువ బాగానే ఉందని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని భావిస్తున్నారు. విదేశీ మారక విల్వలు 5.7 బిలియన్ డాలర్లు క్షిణించి 545.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ మారకపు నిల్వలు పడిపోవడం ఆందోళక కల్గించే అంశమని, ఆర్థిక మాంద్యంలోకి జారుకునే పరిస్థితి లేదని ఆర్బీసీ క్యాపిటల్ ఆసియా ఫొరేక్స్ స్టాటజీ హెడ్ అల్విన్ తెన్ అభిప్రాయపడ్డారు.
విదేశీ విద్య భారం..
డాలర్‌తో రూపాయి విలువ భారీగా క్షిణించడం వల్ల విదేశాల్లో చదువుతున్న, వెళ్లాలనుకుంటున్న వారిపై ఆర్థిక భారం పడనుంది. అధికారిక లెక్కల ప్రకారమే మన దేశానికి 13.24 లక్షల మంది విదేశాల్లో వివిధ కోర్సులు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికాలోనే చదువుతున్నారు. ఇంజినేరింగ్ ఎంఎస్, మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఎక్కువ మంది ఉన్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల్లోనూ పెద్ద సంఖ్యలో మన విద్యార్ధులు ఉన్నారు. వీరితో రష్యా, ఫిలిఫ్పిన్స్, జార్జియా వంటి దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో మెడిసిన్ చేస్తున్న విద్యార్ధులు ఉన్నారు. విదేశాల్లో చదివే విద్యార్ధులు కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు, ఇతర ఖర్చులన్నీ డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇలానే రూపాయి మరింత క్షిణిస్తే వారిపై భారం పెరుగుతుంది. అమెరికా డాలర్‌తో మన రూపాయి మారకం విలువ 2017లో 64.08 రూపాయిలుగా ఉంది.
ప్రస్తుతం అది 81.67 రూపాయిలుగా ఉంది. ఇది మరింత పెరిగి 82 రూపాయిలకు పైగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచడంతో ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీలతో డాలర్ బలపడుతూ వస్తోంది. దీని వల్ల అన్ని దేశాల కరెన్సీలు క్షిణిస్తున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు కూడా రూపాయి క్షిణతకు దోహదం చేస్తున్నాయి. మన దేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటం, విదేశీ మారక నిల్వలు భారీగా క్షిణించడం కూడా రూపాయి విలువ పతనం కావడానికి కారణంగా నిలుస్తున్నాయి.
పెరిగిన ఫీజులు
అమెరికా యూనివర్శిటీల్లో 2010-11లో 4 సంవత్సరాల డిగ్రీ కోర్సులకు సగటు ఫీజు 32 వేల డాలర్లు (అప్పటికి విలువలో 14.40 లక్షలు) గా ఉంది. 2022-23 సంవత్సరం నాటికి అదే నాలుగు సంవత్సరాల కోర్సుకు ఫీజు43 వేల డాలర్లకు పెరిగింది. మన కరెన్సీలో దాదాపు 34.83 లక్షలు. రూపాయి విలువ క్షిణించడంతో అదనంగా 10 శాతం వరకు భారం పడుతుంది. అమెరికాలో రికార్డ్ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల అక్కడ మన విద్యార్ధుల జీవన వ్యయం కూడా పెరుగుతుంది. వారి నెల ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల మరింత అదనపు భారం తప్పదు.
అయినా ముందుకే..
డాలర్‌తో రూపాయి విలువ క్షిణించినప్పటికీ, విద్యార్ధులు విదేశాలకు వెళ్లడాన్ని మానుకోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో ఎంఎస్ చేయాలని చాలా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. విదేశాల్లో చదివిన తరువాత ఉండే ఉద్యోగ అవకశాలు, మెరుగైన వేతన ప్యాకేజీలు ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని, అందు వల్ల పెద్దగా దీని ప్రభావం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఉద్యోగం వస్తే వచ్చే వేతనం డాలర్లలోనే ఉంటుంది. పెరుగుతున్న డాలర్ విలువ అలా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
అమెరికాలో ఉన్న వారికి లాభం
ఇప్పటికే అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగంలో చేరిన భారతీయ విద్యార్ధులకు డాలర్ బలపడటం, రూపాయి క్షిణించడం కలిసి వస్తుంది. రూపాయిల్లో వారి సంపాదన పెరుగుతుంది. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు పంపిచే డాలర్ల మొత్తం పెరగకున్నా, రూపాయల్లో మాత్రం పెరుగుతుంది.