Sunday, November 24, 2024

జీఎస్‌టీ రికార్డు వసూళ్లు, ఏప్రిల్‌లో 1.68 లక్షల కోట్లు

దేశంలో జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈ సారి వసూళ్లు జరిగాయి. 2022 ఏప్రిల్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వస్తు సేవల పన్ను వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జీఎస్‌టీ వసూళ్లలో ఇది జీవిత కాల గరిష్టమని కేంద్రం తెలియజేసింది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత రికార్డు వసూళ్ల తరువాత మార్చి నెల కలెక్షన్లు రెండో అత్యధికంగా ఉన్నాయి. మార్చితో పోలిస్తే.. ఏప్రిల్‌లో రూ.25వేల కోట్లు అధికంగా జీఎస్‌టీ రాబడి వచ్చిందని కేంద్రం వివరించింది. 2021 ఏప్రిల్‌లో వచ్చిన జీఎస్‌టీతో పోలిస్తే.. ఇది 20 శాతం అధికమని స్పష్టం చేసింది.

దిగుమతులపై సెస్‌ రూ.36వేల కోట్లు..

ఏప్రిల్‌లో వసూలైన మొత్తం రూ.1,67,540 కోట్లలో.. సీజీఎస్‌టీ వసూళ్లు రూ.33,159 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ వసూళ్లు రూ.41,793 కోట్లుగా ఉన్నాయి. సమీకృత జీఎస్‌టీ కింద రూ.81,939 కోట్లు ఉండగా.. ఇందులో.. వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.36,705 కోట్లు కలిపిన తరువాత విలువ ఇది. సెస్‌ రూపంలో రూ.10,649 కోట్లు వసూలు జరగగా.. వీటిలో దిగుమతుల నుంచి వసూలు చేసిన రూ.857 కోట్లు కూడా కలిపిన విలువ అని కేంద్ర ఆర్థిక శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. సకాలంలో ట్యాక్స్‌ చెల్లింపులు చేసేలా.. రిటర్న్‌లు సమర్పించేలా అధికారులు చేపట్టిన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని వారు తెలిపారు. జీఎస్‌టీ చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్‌లను దాఖలు చేసేందుకు తీసుకున్న చర్యలు కూడా ఇందుకు దోహదపడినట్టు తెలుస్తోంది.

జీఎస్‌టీ వసూళ్లపై నిఘా..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలిటిక్స్‌ వంటి సాంకేతికతలను వినియోగించి పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.42 లక్షల కోట్లు వసూలు కాగా.. ఇందులో కేంద్ర జీఎస్టీ కింద రూ.25,830 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ కింద రూ.32,378 కోట్లు, సమీకృత జీఎస్‌టీ కింద రూ.74,470 కోట్లు వసూలయ్యాయి. వాటిలో దిగుమతులు నుంచి వసూలు చేసిన పన్నును కూడా కలిపి లెక్కించారు. సెస్‌ కింద రూ.9,417 కోట్లు వసూలయ్యాయి. పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్న్‌లు దాఖలు చేసేలా ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పలు చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులు మెల్లిగా గాడిన పడటం, ఇతర చర్యల కారణంగా వసూళ్లు రికార్డు స్థాయిలో జరిగినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితాలు కరోనా తరువాత ఆర్థిక పరిస్థితులు కుదుటపడటాన్ని సూచిస్తున్నాయని వారు అంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement