Friday, November 22, 2024

ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమపై జీఎస్‌టీ బాదుడు!?

న్యూఢిల్లి:ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీ విధించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమపై విధిస్తున్న పన్నులను సమీక్షించేందుకు మంత్రులతో కూడిన ఓ బృందాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసింది. ఈ బృందం తొలి సమావేశం మే 2వ తేదీన జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల బృందం ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న 18 శాతం పన్నును 28 శాతానికి పెంచేందుకు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మంత్రుల బృందానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాన్రాడ్‌ సంగ్మా మాట్లాడుతూ.. మే 18న రెండో జీఎస్‌టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వాల్యుయేషన్‌ అంశం గురించి చర్చించనున్నట్టు వెల్లడించారు. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రాస్‌ గేమింగ్‌ రెవెన్యూ (జీజీఆర్‌)పై పన్ను వేయాలా.. లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోతగిన మొత్తం ప్రైజ్‌పై వేయాలా..? అన్నది చర్చిస్తామన్నారు.

సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా 80కు పైగా గేమింగ్‌ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పురపాలక, నగర అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను అగ్రగామి ఏవీజీసీ కేంద్రంగా నిలిపేందుకు ప్రణాళికలు వెల్లడించింది. దీని కోసం 1.6 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమేజ్‌ టవర్స్‌ నిర్మించనున్నట్టు కూడా వెల్లడించింది. ఇప్పుడు ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ పరిశ్రమ, ఇమేజ్‌ వృద్ధి పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌ పరిశ్రమ కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న టవర్‌ ఇమేజ్‌.. భారతదేశంలో ఈ పరిశ్రమ సమగ్ర అభివృద్ధికి తోడ్పడనుంది. మే 18న మంత్రుల బృంద సమావేశానికి ముందుగానే.. ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలు, రేస్‌ కోర్సులను కవర్‌ చేసే రీతిలో జీఎస్‌టీ నిబంధనలను సవరించే విషయమై తగు నిబంధనల రూపకల్పనకు సంబంధించి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం అవుతున్నది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ జీఎస్‌టీ రేట్లను పెంచడాన్ని పలు కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. క్షీణిస్తున్న పరిశ్రమను రక్షించుకోవడానికి తమ వాదనను మంత్రుల బృందానికి వివరిస్తున్నాయి.

ఇప్పటికే జీజీఆర్‌, సర్‌ ఛార్జీ బాదుడు

ఈ పరిశ్రమపై 30 శాతం జీఎస్‌టీని ప్రవేశ ఫీజుతో పాటుగా ప్లాట్‌ఫామ్‌ ఫీజు/గ్రాస్‌ గేమింగ్‌ రెవెన్యూ (జీజీఆర్‌)పై 115 శాతం సర్‌ చార్జీ విధించడం ద్వారా ఈ పరిశ్రమను వాణిజ్య పరంగా భరించలేని రీతిలో మలిచారు. ఇండియా టెక్‌ డాట్‌ ఓఆర్‌జీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రమేష్‌ కైలాసం మాట్లాడుతూ.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ సామర్థ్యాన్ని సరైన దిశలో ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యం అధికంగా ఉండే గేమ్‌లకు ప్లాట్‌ఫామ్‌ ఫీజులపై 18 శాతం జీఎస్‌టీ మాత్రమే విధించాలని కోరుతున్నారు. మంత్రుల బృందం సానుకూల దృక్పథంతో సమీక్షించాలని విన్నవించుకుంటున్నారు. ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌ ఫీజు/జీజీఆర్‌ను సరఫరా విలువగా పరిగణించే ప్రస్తుత పద్ధతిని కొనసాగించాలని సిఫార్సు చేయాలంటున్నారు.

- Advertisement -

గేమింగ్‌ పరిశ్రమ విస్తరణపై ఆశలు

భారతీయ గేమింగ్‌ రంగాన్ని మరింత విస్తరించాల్సి ఉంది. దీనికి అనుకూలమైన పన్ను విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. జీజీఆర్‌పై 18 శాతం పన్ను ఉండాలని సూచిస్తున్నారు. జీఎస్టీ పెంపు అంశం.. గేమ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంగా నిలవాలనే హైదరాబాద్‌ ప్రణాళికలకు అడ్డుపడుతుందంటున్నారు. ఈ రంగం ఉన్న గేమ్‌ డెవలపర్లకు కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) నివేదిక ప్రకారం.. ఈ పరిశ్రమ 18 శాతం జీఎస్టీని ప్లాట్‌ఫామ్‌ ఫీజు లేదా జీజీఆర్‌పై వేస్తోంది. ఇతర దేశాల్లో గ్రాస్‌ ఎర్నింగ్స్‌ (జీజీఆర్‌)పై వ్యాట్‌ లేదా జీఎస్టీకి మాత్రమే పరిమితం అయ్యాయి. ప్లాట్‌ఫాం ఫీజు లేదా జీజీఆర్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం పన్ను కొనసాగించాలని నిపుణులు కోరుతున్నారు.

విదేశాల్లో బాదుడు తక్కువే..

అంతర్జాతీయ ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ పన్ను విధానాన్ని యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలు అమలు చేస్తున్న విధానాన్ని వెల్లడించిన నిపుణులు.. అక్కడ 15-20 శాతం పన్ను విధిస్తున్నాయని తెలియజేస్తున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది గోపాల్‌ జైన్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా చూసుకుంటే.. భారత్‌, జీజీఆర్‌కు బదులు ప్రైజ్‌ పూల్‌పై పన్ను వేస్తున్నది. జీజీఆర్‌పై మాత్రమే పన్ను వేయడంతో ఆదాయం నష్టపోవడంతో పాటు గ్రే మార్కెట్‌కు అవకాశాలు తెరిచినట్టు అవుతుందన్నారు. పన్ను విధానం మారితే.. ఈ పరిశ్రమ తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా.. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లపై ట్రాన్సాక్షన్స్‌ 100 శాతం డిజిటల్‌గా ఉండటంతో పాటు డిజిటల్‌ ఇండియాకు గణనీయమైన తోడ్పాటును అందిస్తోంది. దేశంలో స్టార్టప్‌ సంస్కృతి మరో దశకు తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. గ్యాంబ్లింగ్‌ను నైపుణ్య ఆధారిత క్రీడలతో పోల్చొద్దనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పన్నుల విధానం సానుకూలంగా ఉంటే.. ఎఫ్‌డీఐలను మరింత ఆకర్శిస్తుంది. తద్వారా.. ఏవీజీసీ సాఫ్‌ ్టవేర్‌ డెవలప్‌మెంట్‌లో దేశాన్ని శక్తివంతంగా మార్చే అవకాశం ఉంటుందని న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఎస్‌ కృష్ణన్‌ అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement