Friday, November 22, 2024

జీఎస్టీ వసూళ్లు 1.62 లక్షల కోట్లు.. సెప్టెంబర్ లో 10శాతం వృద్ధి

సెప్టెంబర్‌లో వస్తు, సేవల పన్ను వసూళ్లు 10శాతం వృద్ధితో రూ.1.62 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్‌లో స్థూలంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ. 29, 818 కోట్లు కాగా, రాష్ట్రాల జిఎస్టీ రూ.37, 657 కోట్లు, ఐజీఎస్టీ (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,613కోట్లతో కలిపి) రూ.83,623 కోట్లు, సెస్సు రూ. 11,613 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 881కోట్లతో కలిపి)గా ఉన్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నాలుగుసార్లు జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం విశేషం. ఈ ఏడాది ప్రథమార్ధంలో (మొదటి ఆర్నెళ్లలో) రూ.9,92,508 కోట్ల మేరకు వసూళ్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 11శాతం వృద్ధి నమోదైంది. ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2023 మార్చిలో లావాదేవీలకు సంబంధించి అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు లభించాయి. ఆర్థికసంవత్సరం ముగింపు కావడంతో వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ లావాదేవీల (సర్వీస్‌ ఇంపోర్ట్‌ ్స సహా) ఆదాయం సెప్టెంబర్‌ నెలలో అంతకు ముందు సంవత్సరం కంటే 14శాతం అధికంగా వచ్చింది.

గతనెల వసూళ్లలో ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.33,736కోట్లు సీజీఎస్టీ, రూ. 27,578 కోట్లు ఎస్‌జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. ఫలితంగా గత నెలలో కేంద్ర ప్రభుత్వ సీజీఎస్టీ ఆదాయం రూ.63,555కోట్లు, రాష్ట్రాల ఎస్‌జీఎస్టీ ఆదాయం రూ.65,235 కోట్లుగా నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో మహారాష్ట్రలో అత్యధికంగా 17శాతం వార్షిక వృద్ధితో రూ.25,137 కోట్లు వసూలవగా, తర్వాతి స్థానాల్లో కర్ణాటక (రూ.11,693కోట్లు), తమిళనాడు (రూ.10,481కోట్లు), గుజరాత్‌ (రూ.10,129కోట్లు), తెలంగాణ (రూ.5336కోట్లు) ఉన్నాయి. అన్నిటికంటే తెలంగాణ అత్యధికంగా 33శాతం జీఎస్టీ వసూళ్ల వృద్ధిని నమోదుచేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement