Tuesday, November 26, 2024

ల్యాప్‌టాప్‌ దిగుమతులకు లైసెన్స్‌ అవసరంలేదన్న ప్రభుత్వం

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్‌ అవసరంలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దిగుమతులను కేంద్రం పర్యవేక్షిస్తుందని, ఇందు కోసం లైసెన్స్‌లు తీసుకోవాల్సిన అవసరంలేదని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దేశంలోని ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్స్‌ దిగుమతులకు నవంబర్‌ 1 నుంచి లైసెన్స్‌ తీసుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం ఆగస్టులో ప్రకటించింది.


ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవని, కేంద్రం కేవలం పర్యవేక్షిస్తోందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భరత్వాల్‌ చెప్పారు. దిగుమతులను కేంద్రం నిశితంగా గమనిస్తుందని తెలిపారు. దిగుమతుల మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఉందని, ఇది నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) సంతోష్‌ కుమార్‌ సారంగి చెప్పారు.

ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లు, ట్యాబ్స్‌ల దిగుమతులను తగ్గించి, దేశీయంగానే వీటి తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆగస్టులో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించిందని ఆయన తెలిపారు. మన దేశంలో ఇప్పటికే స్టీల్‌, బొగ్గు, పేపర్‌ దిగుమతులపై దిగుమతుల మానిటరింగ్‌ విధానం అమల్లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement