అమరావతి, ఆంధ్రప్రభ చిరుధాన్యాల ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎగుమతుల్లో ఎపీ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1,69,049.22 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఎక్కువగా ఐదు దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది.
ఇతర దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడంతో పాటు స్థానిక వినియోగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్-ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చిరుధాన్యాల ఎగుమతిని ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు ఎగుమతుదారులకు సహాయం అందిస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం..
ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు, అకడమిక్-రీసెర్చ్ సంస్థలు, మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్ (ఈపీఎఫ్)ను ఏర్పాటు చేసింది.
2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణపై దృష్టిసారించాయని పేర్కొంది. స్థానికంగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉత్పత్తి వినియోగాన్ని పెంచడానికి రాష్ట్ర మిల్లెట్ మిషన్లను అమలుచేస్తున్నాయని కేంద్రం తెలిపింది.
అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత రాయబార కార్యాలయాలు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పలు చర్యలను తీసుకుంది. అలాగే, ప్రభుత్వోద్యోగులు, అధికారుల్లో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాల్లో మిల్లెట్ స్నాక్స్‌ను, డిపార్ట్మెంటల్ క్యాంటీన్లలో మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాలను చేర్చాలని సూచించింది.