రష్యా నుంచి మన దేశం కుకింగ్ కోల్ దిగమతులను పెంచనుంది. ఈ బొగ్గును ప్రధానంగా స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియా నుంచి వస్తున్న దిగుమతులను సప్లయర్ నిలిపివేయడంతో స్టీల్ ఇండస్ట్రీ సమస్యలను ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు రష్యా నుంచి దిగుమతులు పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశం ఏటా 70 మిలియన్ టన్నుల వరకు కుకింగ్ కోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఆస్ట్రేలియా నుంచి 50 శాతం వరకు వస్తోంది.
గత నెల ఆస్ట్రేలియాలో కుకింగ్ కోల్ ధరలు ఒక్కసారిగా 50 శాతానికి పైగా పెరిగాయి.
ప్రధానంగా సరైన రైల్ నెట్‌వర్క్ లేకపోవడం, క్వీన్‌ల్యాండ్ నుంచి సప్లయ్స్ తగ్గిపోవడం, నిర్వాహణ లోపాల వంటి కారణాలతో ఈ ధర భారీగా పెరిగింది. ఫలితంగా మన దేశానికి సప్లయ్ చేసే సంస్థ కుకింగ్ కోల్ సరఫరాలను నిలిపివేసింది. ఈ పరిస్థితిని ఆస్ట్రేలియా ప్రభుత్వ దృష్టికి ఇండియా తీసుకెళ్లింది. దీంతో వేగంగా కుకింగ్ కోల్ సప్లయ్ చేస్తామని ఆస్ట్రేలియా మన దేశానికి హామీ ఇచ్చింది. మన దేశంలో ఉన్న స్టీల్ మిల్స్ గత సంవత్సరమే రష్యా నుంచి కుకింగ్ కోల్ దిగుమతులు పెంచుకునేందుకు ప్రయత్నించాయి. ఉక్రెయిన్‌పై దాడితో అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై విధించిన కఠిన ఆంక్షల మూలంగా ఈ ప్రయత్నాలు ఫలించలేదు.
మన దేశం చెల్లింపుల విధానంలో చేసిన మార్పులతో తాజాగా రష్యా నుంచి కుకింగ్ కోల్ దిగుమతులు పెంచుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఆస్ట్రేలియా కుకింగ్ కోల్‌తో పోల్చితే రష్యా కోల్ ధర తక్కువగానే ఉంది. తాజాగా సప్లయ్ పెంచుకుంటున్నందున మరింత ధర తగ్గించేందుకు రష్యాకు చెందిన సరఫరాదారులు అంగీకరించారు. రష్యా కుకింగ్ కోల్ కొనుగోళ్లకు మన దేశానికి డిస్కౌంట్లు ఇవ్వడంతో, డాలర్ల బదులు రూపాయాల్లో చెల్లింపులకు రష్యా అంగీకరించింది. దీంతో ఇండియాకు చెందిన స్టీల్ కంపెనీలు రష్యా నుంచి భారీగా కుకింగ్ కోల్ దిగుమతులు చేసుకోనున్నాయి. సెయిల్ రష్యా నుంచి డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో 75 వేల టన్నుల కుకింగ్ కోల్‌ను దిగుమతి చేసుకోనుందని కంపెనీ ఛైర్మన్ ప్రకటించారు.