ప్రస్తుతం జీఎస్‌టీ శ్లాబ్‌లో ఎక్కువగా ఉన్న 28 శాతం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ శ్లాబులను సవరించాలని, 28 పన్నును తొలగించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. విలాసవంతమైన వస్తువులు, హానికరమైన వాటిపై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 5,12, 18 మూడు రకాల శ్లాబులను కుదించి రెండే ఉండాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న డిమాండ్ ఉందని, దీనిపై కొంత వ్యతిరేకత ఉందన్నారు. ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి మరికొంత కాలం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే, రాష్ట్రాలు కోల్పోయో ఆదాయంపై స్పష్టత రానంత వరకు దీనిపై ఏకాభిప్రాయం సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని రెవెన్యూ కార్యదర్శి కూడా దృవీకరించారు ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆదాయాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్న మన దేశంలో విలాసవంతమైన వస్తువులు, వాహనాలు, హానికరమైన వాటిపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంటుందన్నారు.
ఇక 5,12,18 శ్లాబుల్లో ఉన్న జీఎస్టీని రెండుగా కుదించడం, తరువాత ఒకే దేశం ఓకే తరహా పన్నుగా మారడం చాలా క్లిష్టమైన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇవి కాక ప్రత్యేకంగా బంగారం, నగలపై విలువైన రాళ్లపై ప్రస్తుతం 3 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఒక డైమండ్స్, అన్‌కట్ డైమండ్స్‌పై 1.5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. 28 శాతం వసూలు చేస్తున్న జీఎస్టీ నిధులు ప్రత్యేక కార్పస్ ఫండ్‌కు జమ చేస్తున్నాట్లు రెవెన్యూ కార్యదర్శి తెలిపారు. జీఎస్టీ వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు ఈ నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ పన్నుల్లో మార్పులు, శ్లాబుల సవరణ, జీఎస్టీ పరిధిని ఎలాంటి వాటికి మినహాయింపులు ఇవ్వాలన్న అంశాలపై అధ్యాయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ కర్నాటక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీ తన తుది నివేదిక ఇచ్చేందుకు మరో మూడు నెలల గడువు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. జీఎస్టీని అమల్లోకి తీసుకు రావడానికి ముందు వేసిన సుబ్రమణియన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సహజమైన పన్ను రేటు 15.5 శాతం ఉండాలని సూచించింది.
ఆర్బీఐ స్టడీ ప్రకారం జీఎస్టీ ప్రారంభంలో ఉన్న 14.4 శాతం పన్ను రేటు ప్రస్తుతానికి 11.6 శాతంగా ఉందని పేర్కొంది. ముంత్రుల కమిటీ నివేదిక ప్రకారం గత నెల 28,29 తేదీల్లో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ పలు వస్తువులపై ఉన్న జీఎస్టీ మినహాయింపులను తొలగించింది. రెవెన్యూ రేటు 15.5 శాతం ఉండాలన్న లక్ష్యాన్ని తీసుకుంటే ముందు ముందు జీఎస్టీ రేట్లు పెరగడం ఖాయం. మరికొన్ని వస్తువులు, సేవలు జీఎస్టీకి తీసుకు రావాల్సి ఉంటుంది. దీనిపై స్పందించిన రెవెన్యూ కార్యదర్శి విధాన నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉందన్నారు. విధాన నిర్ణయాలు చేసే వారు దృష్టి ఎలా ఉంటుందో చూడాలన్నారు. 15 శాతం ఆదాయం లక్ష్యంగా ఉంటే కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.