Saturday, November 23, 2024

వంటనూనెలపై సుంకాల రాయితీ.. 6 నెలలు పెంచిన ప్రభుత్వం

ధరలను నియంత్రించేందుకు వీలుగావంటనూనెల దిగుమతి సుంకాల్లో కల్పిస్తున్న రాయితీని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం సుంకాల్లో రాయితీని 2023 మార్చి వరకు కొసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయంగా సరఫరాను పెంచి, ధరలను కట్టడి చేయాలని కేంద్ర ఆహార శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు తగ్గుతున్నాయి. దీని వల్ల దేశీయంగానూ వీటి ధరలు అదుపులోకి వస్తున్నాయని పేర్కొంది. సుంకాల్లోనూ రాయితీ ఇస్తున్నందున నూనెల ధరలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ముడి, రిఫైన్డ్‌ పామాయిల్‌, ముడి, రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్‌, ముడి, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ నూనెలపై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలు కొనసాగుతాయి. ప్రస్తుతం ముడి రకాల వంటనూనెల దిగుమతిపై సున్నా దిగుమతి సుంకం ఉంది. వ్యవసాయం, సామాజిక సంక్షేమ సెస్సులతో కలిపి మొత్తంగా వీటి దిగుమతిదారులు 5.5 శాతం పన్ను కడుతున్నారు. రిఫైన్డ్‌ పామాయిల్‌ దిగుమతిపై 13.75 శాతం, రిఫైన్డ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలపై 19.25 శాతం పన్ను విధిస్తున్నారు.

గత సంవత్సరం మన దేశంలో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. దేశీయ అవసరాల్లో మనం 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నాం. దీంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌ తలక్రిందులైంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొనడంతో ప్రభుత్వం వీటి ధరల కట్టడికి చర్యలు ప్రారంభించింది. వీటి ధరలను అదుపు చేసేందుకు పలు దఫాలుగా సుంకాలను తగ్గించింది. 2020-21 అక్టోబర్‌తో ముగిసిన ఆయిల్‌ మార్కెటింగ్‌ ఏడాదిలో మన దేశం 1.17 లక్షల కోట్ల విలువ చేసే వంటనూనెలను దిగుమతి చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement