ఇటీవల కాలంలో జోకర్ యాప్‌ల ద్వారా మాల్‌వేర్ సెల్‌ఫోన్‌లలో చొరబడి డ్యామేజ్ చేస్తోంది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని రకాల సమాచారాన్ని సేకరించి హ్యాకర్లకు పంపుతోంది. ఇటువంటి మాల్‌వేర్‌పై దృష్టి సారించిన గూగుల్ నాలుగేళ్ల నుంచి దాదాపు 1800 యాప్‌లను తొలగించింది. కొంతకాలంగా ప్లే స్టోర్‌లోని యాప్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఈ జోకర్ మాల్వేర్ ఉన్న యాప్‌లను గూగుల్ తొలగించే పనిలో పడింది. అయినా దీని ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. హ్యాకర్లు జోకర్ మాల్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కొత్తగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం.
తాజాగా ప్లేస్టోర్ లోని కొన్ని యాప్‌లపై ఓ మాల్వేర్ దాడి చేస్తున్నట్టు గుర్తించిన సైబర్ నిపుణులు, మరింత లోతుగా పరిశోధించగా ఇది కొత్త జోకర్ పనే అని తేలింది. ఇది కెమెరా, ఫొటో ఎడిటింగ్, ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్, వాల్ పేపర్, ట్రాన్స్ లేషన్ యాప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందని, వాటి ద్వారా ఫోన్లలోకి ప్రవేశిస్తోందని గుర్తించారు. ఇది ఓ యాప్‌పై దాడి చేయగానే, మొదటి యాప్ కోడ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో యాప్ లేటెస్ట్ వెర్షన్ సమాచారం లేకపోతే మాల్‌వేర్ ఎలాంటి ప్రభావం చూపదు. యాప్ లేటెస్ట్ వెర్షన్ సమాచారం ఉంటే మాత్రం ఫోన్ యూజర్ వివరాలన్నీ చోరీ చేస్తుంది. అందుకోసమే యూజర్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లతో ఫోన్లను స్కాన్ చేస్తుండాలని, యాప్ స్టోర్లలో ఆయా యాప్‌ల రేటింగ్‌లను బట్టి కూడా వాటి భద్రతను అంచనా వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి: పోటీ పడి మోదీకి దండాలు పెడుతున్న ప్రజలు