Tuesday, November 26, 2024

Google Gemini | ఓపెన్ ఏఐ’కు పోటీగా అడ్వాన్స్‌డ్‌ ఏఐ మోడల్‌

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో గూగుల్‌ కొత్త శకానికి తెరలేపింది. గూగుల్‌ జెమినీ పేరుతో అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్, ఫోటో, ఆడియో, వీడియో, కోడింగ్‌ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలిపింది. జెమినీ 1.0 వెర్షన్‌ను మూడు వేరియంట్లలో తీసుకు వచ్చారు. జెమినీ అల్ట్రా జెమిని ప్రో, జెమినీ నానో ఇలా మూడు వేరియంట్లలో దీన్ని పరిచయం చేసింది.

ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్‌ డివైజ్‌ల వరకు అన్నింటిలో పని చేస్తుందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. గూగుల్‌ గతంలో పరియం చేసిన బార్డ్‌ను మరింత అభివృద్ధి చేసి జెమినీని అభివృద్ధి చేసింది. సెర్చ్ రిజల్ట్స్‌లో ఏఐ సాంకేతికతను చొప్పించి ప్రజలకు అందించడానికి డీప్‌ మైండ్‌ ఏఐ ల్యాబ్‌ను స్థాపించామని ఆయన తెలిపారు. ఆనాటి తమ ఆలోచనలకు వాస్తవరూపమే ఈ జెమినీ ఏఐ నమూనా అని, దీనికి సంబంధించిన పరిశోధనలను ఎంతో ధైర్యంగా, బాధ్యతతో చేపట్టినట్లు తెలిపారు.

- Advertisement -

ఒక లక్ష్యం దిశగా ఆవిష్కరణలు చేయడం, ప్రజలకు, సమాజానికి అపారమైన ప్రయోజనాలు చేకూర్చే సామర్ధ్యాలను అందిపుచ్చుకోవడం తమ ప్రాధాన్యత అంశాల ని చెప్పారు. అదే సమయంలో ఏఐ సామర్ధ్యంతో ఎన్నో సవాళ్లు తలెత్తుతున్నాయని, ఏఐతో లాభాలతో పాటు, నష్టాలు కూడా ఉండడంతో, సైబర్‌ భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలతోనూ, నిపుణులతోనూ కలిసి పని చేస్తున్నామని సుందర్‌ పిచాయ్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

జెమినీ ఏఐ అంటే…

జెమినీ ఒక సాఫ్ట్‌ వేర్‌ టూల్‌ లాంటిదే. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించిన ఒక భారీ లాంగ్వేజ్‌ నమూనానే జెమిని. అంతేకాదు దీంట్లో ఒక సంక్లిష్ట గణిత వ్యవస్థ కూడా ఉంది. ఈ వ్యవస్థ ద్వారా జెమినీ ఏఐ అపారమైన డేటాను విశ్లేషించి తనంతట తానే అనేక కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటుంది. పుస్తకాలు, వికీపీడియా వ్యాసాలు, ఆన్‌లైన్‌ బులెటిన్‌ బోర్డులు ఇలా దేన్నీ వదలకుండా చవివేసి, ప్రతి అంశంలోనూ తన సొంత డేటాను రూపొందిస్తుంది. తద్వారా పరీక్షలు రాయడమే కాదు, సొంతంగా కంప్యూటర్‌ కోడ్‌లను కూడా సృష్టిస్తుంది. తన డేటాలో నిక్షిప్తమైన ఆలోచనలను విశ్లేషించి ఓ మనిషిలా సంభాషించగలదు. ఓపెన్‌ ఏఐ తీసుకువచ్చిన చాట్‌జీపీటీకి జెమినీతో బదులివ్వాలని గూగుల్‌ భావిస్తోంది.

జెమినీ ప్రత్యేకతలు…

శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన పరిశోధన పత్రాల్లో గ్రాఫ్‌లు, గణాంకాలను రూపొందించగలదు. విద్యార్ధుల హోంవర్క్‌లో సాయపడుతుంది. ఉదాహరణకు మ్యాథ్స్‌ హోంవర్క్‌ను ఫోటో తీసి జెమినీలో అప్‌లోడ్‌ చేస్తే దానికి కచ్చితమైన సమాధానం ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను గూగుల్‌ షేర్‌ చేసింది. దాంతో పాటు ప్రోగామింగ్‌ లాంగ్వేజ్‌లను రాయడంతోపాటు, యూజర్లకు సులభమైన పద్ధతిలో విరిస్తుంది.

జెమినీ ప్రస్తుతం ఇంగ్లీష్‌ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్‌లో ప్రపంచంలోని అన్ని భాషల్లో పరిచయం చేస్తామని గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌, క్రోమ్‌ బ్రౌజర్‌ సహా ఇతర గూగుల్‌ సర్వీసుల్లో జెెమినీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

జెెమినీ నానో..

ఇది జెెమినీ ఏఐ మోడల్‌ లైట్‌ వెర్షన్‌. మొబైల్‌ డివైజ్‌ల కోసం దీన్ని డిజైన్‌ చేసినట్లు గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫోన్‌తో పాటు ఆండ్రాయిడ్‌ 4 వెర్షన్‌లో డిసెంబర్‌ 13 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది. చాట్‌, మెసేజింగ్‌ యూప్‌లలో ఇతరుల మెసేజ్‌లను యూజర్‌ రిప్లయ్‌ ఇచ్చేందుకు కావాల్సిన సమాచారాన్ని ముందుగానే సూచిస్తుంది.

జెమినీ ప్రో..

ప్రస్తుతం వినియోగంలో ఉన్న గూగుల్‌ బార్డ్‌ ఏఐకు ఇది అడ్వాన్స్‌డ్‌ వె ర్షన్‌. కచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలను ఇస్తుందని గూగుల్‌ తెలిపింది. డెవలపర్స్‌ గూగుల్‌ ప్రాజెక్ట్స్ కమర్షియల్‌ యూజర్లకు డిసెంబర్‌ 13 నుంచి జెమినీ ఏపీఐ, గూగుల్‌ జనరేటివ్‌ ఏఐ స్టూడియో, వెర్టెక్స్‌ ఏఐ, గూగుల్‌ క్లౌడ్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది.

జెమినీ అల్ట్రా…

ఏఐ లాంగ్వేజ్‌ మోడల్‌లోనే శక్తివంతమైన వెర్షన్‌ ఇదేనని గూగుల్‌ తెలిపింది. డేటా సెంటర్లు, కార్పొరేట్‌ సంస్థల వ్యాపార అవసరాల నిమిత్తం దీనిని ఉపయోగించవచ్చని తెలిపింది. పైథాన్‌, జావా సీప్లస్‌ ప్లస్‌ గో వంటి ప్రోగ్రామింగ్‌ అంగ్వేజ్‌లను అర్థం చేసుకుని సులభతర విధానంలో వివరించగలదని గూగుల్‌ తెలిపింది. 2024లో దీనిని యూజర్లకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement