హైదరాబాద్, ఆంధ్రప్రభ : విజయ డెయిరీ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గేదె పాల ధరను లీటర్కు రూ.46.69 నుంచి రూ.49.40 రూపాయలకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆవుపాల ధర లీటర్కు రూ.33.75 నుంచి రూ.38.75 కు పెంచుతామన్నారు. సోమవారం హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ సంస్థలో నిర్వహించిన పాడి రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి తలసాని మాట్లాడారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాయితీపై పాడి గేదెలు, ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఉమ్మడి ఏపీలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ తెలంగాణ ఏర్పడ్డాక లాభాల బాట పట్టించామన్నారు. విజయ డెయిరీ లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రైవేటు డెయిరీలకు ధీటుగా నాణ్యమైన పాలు, దాని అనుబంధ ఉత్పత్తులను విజయ డెయిరీ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విజయ డెయిరీ పాలను మాత్రమే వాడాలని వినియోగదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమైన తరుణంలో అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ – సహకార రంగ డెయిరీలకు పాలు పోసే రైతుల సంఘంసేవలు, పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి తలసాని పేర్కొన్నారు.