Saturday, November 23, 2024

గిగ్‌ వర్కర్లకు మంచిరోజులు!తాత్కాలిక టెకీ ఉద్యోగులకు డిమాండ్‌

ఐటీరంగంలో నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడిన నేపథ్యంలో గిగ్‌ వర్కర్లను భారీఎత్తున నియమించుకునేందుకు భారత టెక్‌ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సేవలందించే తాత్కాలిక ఉద్యోగులను గిగ్‌ వర్కర్లుగా పిలుస్తారు. భారత్‌లోని టెక్‌ సంస్థల్లో 65 శాతం కంపెనీలు గిగ్‌ వర్కర్లను పెంచుకోవాలని నిర్ణయించినట్లు తేలింది. 2వేలమంది ఉద్యోగులకన్నా ఎక్కువమంది సిబ్బంది ఉన్న సంస్థల్లో ప్రస్తుతం గిగ్‌ వర్కర్ల సంఖ్య 5 శాతం కన్నా తక్కువే. అయితే ఇప్పుడిప్పుడే వారివైపు భారతీయ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. 2020లో 57 శాతం సంస్థలు గిగ్‌ వర్క్‌ర్ల సేవలు పొందితే, ఇప్పుడు 65 శాతం సంస్థలు వారిని నియమించుకుంటున్నాయని నాస్కామ్‌ నివేదిక వెల్లడించింది. అంతమాత్రాన ఉద్యోగుల్లో గిగ్‌ వర్కర్ల నిష్పత్తిలో పెద్దమార్పు రాకపోవచ్చు. 2వేలమందికన్నా తక్కువ సంఖ్యలో ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులున్న సంస్థల్లో గిగ్‌ వర్కర్లకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఆ సంస్థల్లో మొత్తం ఉద్యో గులతో పోలిస్తే వీరి సంఖ్య 5 శాతం కన్నా ఎక్కువే. గిగ్‌ వర్కర్ల నియామకంపై నాస్కామ్‌, ఇండీడ్‌, ఏఓఎన్‌ సంస్థలతో కలిసి అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించింది. పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు, నిపుణులను సమీకరించుకునే వ్యూహంలో భాగంగా ఈ గిగ్‌ వర్క్‌ ఫోర్స్‌ కీలకపాత్ర పోషించబోతోందని నాస్కామ్‌ అధ్యక్షుడు దేబ్‌జని ఘోష్‌ అభిప్రాయపడ్డారు.

మొత్తం భారతీయ సంస్థల్లో 15 శాతం గిగ్‌ వర్కర్ల సంఖ్యను బాగా పెంచాయని, ప్రత్యేకించి గడచిన రెండేళ్లలో దాదాపు 30 శాతం మేర గిగ్‌ వర్కర్ల సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్టెమ్‌ గ్యాడ్యుయేట్ల (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌) అందిస్తున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచమంతటా డిజిటల్‌ రంగంలో మార్పు సంభవిస్తున్న వేళ నిపుణుల కొరత వేధిస్తోంది. ఆ కొరతను నివారించడానికి వివిధ సంస్థలు వ్యూహాత్మకంగా ఈ గిగ్‌ వర్క్‌ఫోర్స్‌ను పెంచుకుంటున్నాయి. ప్రత్యేకించి సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో గిగ్‌ వర్కర్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గడచిన రెండేళ్లలో గిగ్‌ ఎకానమీ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ రంగంలో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయడం, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌, డేటా ఎనలైటిక్స్‌ విభాగాల్లో గిగ్‌ వర్కర్లకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ మూడింటిలో నైపుణ్యాన్ని సాధించడాన్ని గిగబుల్‌ స్కిల్‌గా చెబుతారు. కోవిడ్‌కు ముందు గిగ్‌ ఉద్యోగులకు 9 నెలల కాలపరిమితితో మాత్రమే ప్రాజెక్టులు అప్పగించేవారు.

- Advertisement -

కానీ ఇప్పుడు ఆ వ్యవది అమాంతం పెరగడం విశేషం. ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల్లో 25 శాతం సంస్థలు గిగ్‌ వర్కర్ల ప్రాజెక్టు కాలపరిమితిని ఏకంగా 12 నెలలకు పెంచినట్లు వెల్లడించాయి. అలాగే ఉద్యోగ బాధ్యతలు అప్పగించే ముందే వేతనాన్ని ఖరారు చేయడం మరో సానుకూల పరిణామం. ఏకంగా 40 శాతం సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాగా మరో 53 శాతం సంస్థలు గిగ్‌ ఉద్యోగులను భవిష్యత్‌లో ఫుల్‌టైమర్లుగా చేర్చుకునేందుకు విధివిధానాలు అమలు చేస్తున్నాయి. కాగా ఒకసారి పనిచేసి, ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వెళ్లిపోయిన తాత్కాలిక ఉద్యోగులకు వారి ప్రతిభ ఆధారంగా, మళ్లిd మళ్లిd అవకాశాలు ఇచ్చేందుకు 90 శాతం సంస్థలు సుముఖంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement