Friday, November 22, 2024

Gold Rates | పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.1,130 ఎగిసిన తులం ధర!

ప‌సిడి ధ‌ర ప‌రుగులు తీస్తోంది. ఒక్కసారిగా ఆకాశానికి ఎగిసింది. దీంతో గురువారం మరో సరికొత్త స్థాయికి చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్‌ పసిడి ధర రూ.1,130 ఎగబాకి ఆల్‌టైమ్‌ హైని తాకింది. మునుపెన్నడూ లేనివిధంగా రూ.67, 450 వద్ద నిలిచింది. హైదరాబాద్‌లోనూ రూ.1,090 పుంజుకొని రూ.67,420 వద్ద ఉన్నది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌.. ఈ ఏడాది వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులను గోల్డ్‌వైపునకు మళ్లిస్తున్నారు. ఏవైనా ఒడుదొడుకుల నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్లకు రక్షణగా గోల్డ్‌నే ఎంచుకుంటున్నారు మరి. ఈ క్రమంలోనే రేట్లు ఇంతలా పెరిగాయని మార్కెట్‌ నిపుణులు తాజా ట్రేడింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

గ్లోబల్‌ మార్కెట్‌లో..

అంతర్జాతీయ మార్కెట్లలోనూ పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఔన్సు 2,202 డాలర్లు పలికింది. ఒక్కరోజే ఏకంగా 48 డాలర్లు పెరగడం విశేషం. అయితే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు గోల్డ్‌ను విపరీతంగా కొనేస్తుండటం కూడా ఇందుకు కారణమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. భారతీయ మార్కెట్‌పైనా ఈ ప్రభావం ఉన్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పామర్‌ అన్నారు.

వెండి ధగధగలు

బంగారంతోపాటు వెండి రేట్లూ ఎగిశాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,100 పెరిగి రూ.77,750ని చేరింది. హైదరాబాద్‌లోనైతే ఇది రూ.78,500లుగా నమోదైంది. బుధవారంతో పోల్చితే రూ.1,500 ఎగిసింది. సాధారణ వినియోగదారులతోపాటు పరిశ్రమల నుంచీ పెరిగిన డిమాండే ఇందుకు కారణం అంటున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్సు వెండి 25.51 డాలర్లకు చేరింది.

ఫ్యూచర్‌లోనూ రికార్డులు..

బంగారం ధరలు ఫ్యూచర్‌ మార్కెట్‌లోనూ రికార్డులు సృష్టించాయి. ఏప్రిల్‌ డెలివరీకిగాను 10 గ్రాములు రూ.1,014 లేదా 1.54 శాతం పెరిగి రూ.66,764 పలికింది. ఈ మేరకు 12,067 లాట్లలో బిజినెస్‌ జరిగింది. స్పాట్‌ మార్కెట్‌లో రికార్డు ధరలు ప్రభావితం చేసినట్టు మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. న్యూయార్క్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ఔన్సు 2,228.60 డాలర్లుగా నమోదైంది. మరోవైపు వెండి ధరలూ ఫ్యూచర్‌ మార్కెట్‌లో పెరిగాయి. మే నెల డెలివరీకిగాను కిలో రూ.1,222 లేదా 1.62 శాతం ఎగిసి రూ.76,535 పలికింది. ఈ మేరకు 26,504 లాట్లలో లావాదేవీలు జరిగాయి. న్యూయార్క్‌ అంతర్జాతీయ ఫ్యూచర్‌ మార్కెట్‌లోనూ ఔన్సు 25.84 డాలర్లుగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement