మూడేళ్లుగా రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధరల జోరు, కొత్త ఏడాదిలోనూ కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మన దేశంతో పాటు దాదాపు 40 దేశాల్లో ఎన్నికలు జరగనుండటం, ఇప్పటికే ఉన్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు, ఆర్థిక మందగమనమూ ఇందుకు కారణం కానుంది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.65,000 స్థాయిలో, వెండి కిలో రూ.75,000 సమీపంలో ఉండగా, వచ్చే ఏడాదిలో పసిడి ధర రూ.70,000కు, వెండి ధర రూ.90,000కు చేరొచ్చన్నది వ్యాపార వర్గాల అంచనా.
గత దశాబ్దంలో చూస్తే 2013 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు అంతర్జాతీయంగా పసిడి ధరలు తక్కువ స్థాయుల్లోనే కొనసాగాయి. అప్పట్లో ఔన్సు (31.10 గ్రాములు) 12001్ఖ350 డాలర్ల స్థాయిలోనే ఉంది. కొవిడ్ పరిణామాలున్న 2020లో మాత్రం పసిడి ఔన్సు సగటు ధర 1775 డాలర్లుగా ఉంది. 2019తో పోలిస్తే, ఈ ధర 37% అధికం కావడం గమనార్హం. 2021లో సగటు ధర 1780 డాలర్లకు చేరగా, 2022లో మరికొంత అధికమై 1804 డాలర్లుగా నమోదైంది.
ఈనెల 3న రికార్డు స్థాయిలో 2152 డాలర్లకు చేరిన పుత్తడి, ప్రస్తుతం 2075 డాలర్ల వద్ద కదలాడుతోంది. వచ్చే ఏడాదిలో పరిస్థితులను బట్టి 2150-2300 డాలర్ల మధ్య కదలాడొచ్చని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో గ్రాము మేలిమి బంగారం ధర రూ.5,425 ఉండగా, ఇప్పుడు రూ.6,540కు చేరింది. అంటే గ్రాముకు రూ.1100 పెరిగింది. వచ్చే ఏడాది అంతర్జాతీయంగా ఔన్సు ప్రస్తుత 2075 డాలర్ల నుంచి 2300 డాలర్లకు చేరితే, దేశీయంగా గ్రాము రూ.7,100కు చేరే అవకాశం ఉంది.