భారతీయులకు.. అందునా మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. అందునా ఇప్పుడు పెండ్లిండ్ల సీజన్.. అయినా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. మూడు నెలల నాటి స్థాయికి పడిపోయాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా బంగారం స్వర్గధామమే. బుధవారం మల్టీ కమొడిటి ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో జూన్ డెలివరీ పది గ్రాముల బంగారం ధర రూ.50,637 పలికింది. మార్చి నెల ప్రారంభంలో రూ.56 వేల చేరువలోకి వెళ్లిన పసిడి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22-క్యారట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 పలికింది. 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.51 వేలుగా నమోదైంది. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పన్నులను బట్టి బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1832.06 డాలర్లు పలుకుతున్నది.
అమెరికా డాలర్ విలువ 20 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడటంతో బంగారం గిరాకీ పడిపోయింది. డాలర్లతోపాటు అమెరికా ట్రెజరీ బాండ్ల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. గ్లోబల్ రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా బంగారం సురక్షిత పెట్టుబడి మార్గం అని ఇన్వెస్టర్లు విశ్వసించే వారు. కానీ, గతవారం అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో డాలర్ విలువ పెరిగి బంగారానికి గిరాకీ పడిపోయిందని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..