Sunday, November 24, 2024

Ghost malls | దేశంలో పెరుగుతున్న ఘోస్ట్‌ మాల్స్‌

దేశంలో కొనుగోలుదారుల అభిరుచులు మారిపోతున్నాయి. ఎక్కువ మంది ఆన్‌లైన్‌పై ఆధారపడి షాపింగ్‌ చేస్తున్నారు. లేదంటే మెరుగైన షాపింగ్‌ అనుభూతి కోసం పెద్ద పెద్ద మాల్స్‌కు కుటుంబాలతో కలిసి వెళ్లి షాపింగ్‌ చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న షాపింగ్‌ మాల్స్‌ గిరాకీ తగ్గుతోంది. దీంతో ఇవి ఘోస్ట్‌ మాల్స్‌గా మారిపోతున్నాయి. సాధారణంగా ఉన్న మాల్‌ ప్రాపర్టీలో 40 శాతం ఖాళీగా ఉంటే వాటిని ఘోస్ట్‌ మాల్స్‌గా వ్యవహరిస్తారు.

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇలాంటి మాల్స్‌ 2022లో 57 ఉంటే, 2023 నాటికి 64కు పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ఈ సంస్థ థింక్‌ ఇండియా థింక్‌ రిటైల్‌ 2024 పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. 29 నగరాల్లో 58 హైస్ట్రీట్స్‌, 340 షాపింగ్‌ సెంటర్లను పరిశీలించాక నైట్‌ ఫ్రాంక్‌ ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా గత సంవత్సరం 64 ఘోస్ట్‌ మాల్స్‌ వల్ల 13.3 మిలియన్‌ చదరపు అడుగుల లీజు స్థలం నిరుపయోగంగా మారినటలు నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. 2022తో పోలిస్తే ఇది 58 శాతం పెరిగినట్లు తెలిపింది. ఢిల్లి రాజధాని ప్రాంతంలో అత్యధికంగా ఘోస్ట్‌ మాల్స్‌ ఉన్నాయని వెల్లడించింది. ఢిల్లి తరువాత ముంబై, బెంగళూర్‌ ఉన్నాయి. హైదరాబాద్‌లో 19 శాతం ఘోస్ట్‌ మాల్స్‌ తగ్గినట్లు నైట్‌ ఫ్రాంక్‌ తన నివేదికలో తెలిపింది.

దేశవ్యాప్త ట్రెండ్‌ను పరిశీలించినప్పుడు లక్ష చదరపు అడుగుల లీజు స్థలం కలిగిన చిన్న చిన్న మాల్స్‌లో వేకెన్సీరేటు 36 శాతంగా ఉంది. 5 లక్షల కంటే ఎక్కువ చదరపు అడుగులు కలిగిన పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో వేకెన్సీ రేటు 5 శాతం మాత్రమేనని పేర్కొంది. మిడ్‌ లెవల్‌ షాపింగ్‌ మాల్స్‌ వేకెన్సీ రేటు 15.5 శాతంగా ఉందని వెల్లడించింది.

ఘోస్ట్‌ మాల్స్‌ వల్ల రిటైల్‌ సెక్టార్‌కు 6,700 కోట్ల మేర నష్టం వచ్చిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా పేర్కొంది. చిన్న మాల్స్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ప్రాపర్టీ ఓనర్స్‌కు సవాల్‌గా మారిందని, అద్దెదారులను ఆకర్షించడంలో వారు విఫలమవుతున్నారని తెలిపింది.

- Advertisement -

గ్రేడ్‌ ఏ మాల్స్‌ వినియోగదారులతో కిటకిటలాడుతుండగా, గ్రేడ్‌ సి మాల్స్‌ ఘోస్ట్‌ సెంటర్లుగా మారుతున్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బాలాజీ చెప్పారు. కొన్ని చిన్న చిన్న మాల్స్‌ మూతపడుతున్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా డైరెక్టర్‌ గులాం జియా చెప్పారు. వినియోగదారుల అభిరుచి, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణగా రిటైల్‌ స్పేస్‌ను డెవలప్‌ చేయాల్సిన అవసరం ఉందని నై ట్‌ ఫ్రాంక్‌ నివేదిక అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement