ముంబై : ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా బాటలోనే రిలయన్స్ జియో నడిచింది. టారిఫ్ రేట్లను భారీగా పెంచి యూజర్లకు షాకిచ్చింది. కొత్త అన్ లిమిటెడ్ ప్లాన్స్ టారిఫ్ లను దాదాపు 20 శాతం మేర పెంచినట్టు ఆదివారం ప్రకటించింది. పెరిగిన టారిఫ్ లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. జియోఫోన్ ప్లాన్ రూ.75ని రూ.91కి పెంచినట్టు పేర్కొంది. ఇక అన్ లిమిటెడ్ ప్లాన్స్లో రూ.129ని రూ.155కి, రూ.199ని రూ.239కి, రూ.399ని రూ.479కి పెంచినట్టు వివరించింది.
ఏడాది ఆఫర్ రూ.2399 ప్లాన్ ని రూ.2879కి పెంచింది. టెలికం రంగం మనుగడను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా నూతన అన్ లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించామని వ్యాఖ్యానించింది. టెలికం రంగం ప్రతి భారతీయుడికీ డిజిటల్ లైఫ్ ద్వారా సాధికారతను అందిస్తోందని పేర్కొంది. జియో టారిఫ్ లు పెంపుతో మూడు ప్రధాన టెలికం కంపెనీలు ధరలు పెంచినట్టయింది. కస్టమర్ల నుంచి మరింత ఆదాయం పొందేందుకు టెలికం ఆపరేటర్లు టారిఫ్ ధరలు పెంచాయి.