పెట్రోల్, డీజెల్‌పై 35పైసలు చొప్పున పెంపు
న్యూఢిల్లి: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధర ప్రభావంతో వరుసగా రెండవ రోజు గురువారం కూడా రెటైల్ ఇంధన ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా సరికొత్త గరిష్టానికి చేరాయి. గురువారం లీటర్ పెట్రోల్, డీజెల్ 35 పైసలు చొప్పున పెరిగాయి. తాజా పెరుగుదలతో దేశరాజధాని న్యూఢిల్లిdలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.54కు చేరింది. డీజెల్ ధర రూ. 95.27 గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. విమాన ఇంధనం ఏటీఎఫ్ రేటుతో పోల్చితే పెట్రోల్ 35 శాతం ఎక్కువగా ఉంది. చెన్నయ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 103 మార్క్ దాటింది. ఇక డీజెల్ రూ.99.59గా ఉంది. మెట్రో సిటీల్లో ముంబైలో పెట్రోల్ అత్యధికంగా రూ. 112.44 కాగా డీజెల్ ధర 103.26గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 107.12, లీటర్ డీజెల్ రూ. 98.38గా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెల్లలో క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.21 శాతం మేర పెరిగి బ్యారెల్ 86.04 డాలర్లుగా ఉంది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ ఫ్యూచర్స్ 1.10 శాతం పెరిగి 83.87 డాలర్లకు చేరింది.