Tuesday, November 19, 2024

TS | తూనికలు, కొలతల్లో వ్యాపారుల మోసాలు.. ఒకే రోజు 54 కేసులు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వస్తువులు, సరుకులు తదితరాల కొనుగోళ్లలో వ్యాపారులు తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్న ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యకృత్యమయ్యాయి. కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్ల నుంచి రోడ్లమీద విక్రయించే తోపుడుబండ్ల వ్యాపారుల వరకు తూనికలు, కొలతల్లో వ్యాపారుల మోసం యథేచ్ఛగా కొనసాగుతోంది.

వ్యాపారులు ఎలక్ట్రిక్‌ వేయింగ్‌ మిషన్లలోను ట్యాంపరింగ్‌కు పాల్పడుతూ తూకం, కొలతల్లో దోపీడీకి పాల్పడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర సరుకులను తక్కెడలతో తూకం వేసి వ్యాపారులు ఇచ్చేవారు. ప్రస్తుతం తక్కెడలు పోయి వాటి స్థానంలో డిజిటల్‌ కాంటాలు వచ్చాయి. దీంతో పక్కాగా తూకం వేస్తున్నారనుకుంటే మోసానికి గురైనట్టే.

ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ కాంటాలతో తూకాలు, కొలతల్లోనూ మోసాలు పెచ్చుమీరిపోయాయి. ప్రధానంగా కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో వివిధ ఆహార పదార్థాల తూనికలు, కొలతల్లో వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో తరచూ వినియోగదారులు, వ్యాపారులకు, మధ్య వాగ్వాదా జరుగుతున్నా తూనికలు కొలతల శాఖ అధికారులు, సిబ్బంది తమకు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

కొన్ని దుకాణాల్లో సీల్‌ లేకుండానే ఎలక్ట్రానిక్‌ కాంటాను వినియోగిస్తున్నారు. మరి కొన్ని చోట్ల అరిగిపోయిన రాళ్లు, మొద్దు కాంటాలు వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇక మాంసాన్ని విక్రయించే దుకాణాల్లో మాత్రం భారీగా తేడాలు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే వస్తువులు, సరుకులను ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తున్న ఘటనలు కూడా నిత్యం చోటు చేసుకుంటున్నాయి.

చిల్లర దుకాణాలు, చికెన్‌ షాపులు, కూరగాయల మార్కెట్లపై తూనికల, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు- తూకాలు వేసి వినియోగదారులను దోచుకుంటు-న్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుకు సరిపడా సరుకులు రావడలేదని, అడిగితే వ్యాపారులు ఎదురుదాడి చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలకు తోడు వ్యాపారులు ఇలా దోపిడీ చేస్తుంటే ఎలా బతకాలి..?, ఇకనైనా అధికారులు స్పందించి మధ్యతరగతి ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తూనికలు, కొలతల అధికారులు నిర్లక్ష్యంతోనే వ్యాపారులు విచ్చలవిడిగా మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా వ్యాపారులు వాడుతున్న కాంటా తూకం, రాళ్లను తనిఖీ చేసి అధికారులు ముద్రలు వేయాల్సి ఉంటు-ంది. కానీ అసలు తూనికలు, కొలతల శాఖ అనేది ఒకటుందన్న విషయంకూడా ప్రజలకు తెలియడం లేదంటే ఆ శాఖ పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కిలో మాంసం కొంటే వచ్చేది 800 గ్రాములే…

హైదరాబాద్‌, వికారాబాద్లోని పలు చోట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. అసిస్టెంట్‌ కంట్రోలర్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు తూనికలు, కొలతల అక్రమాలపై 54 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తపేట, ఉప్పుగూడ ప్రాంతాల్లో నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు. తూకాల్లో పెద్ద ఎత్తున వ్యత్యాసం వచ్చినట్లు గుర్తించామన్నారు. డిజిటల్‌ కాంటాల్లో సెట్టింగ్స్‌ మార్చి వ్యాపారులు తక్కువ తూకం చూపిస్తున్నారని, పలు దుకాణదారులు కిలోకు 200 గ్రాముల మాంసం తక్కువగా విక్రయిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement