Tuesday, November 26, 2024

Follow up : జాబ్‌ పేరుతో సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ మోసం.. ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర లక్ష నుంచి రెండు లక్షలు వసూలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మాదాపూర్‌లోని డాన్యోన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200 మంది నుంచి ఈ ఐటీ కంపెనీ డబ్బులను వసూలు చేసింది. ఒక్కోక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. ఫేస్‌బుక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావాలంటూ ప్రకటనను డాన్యోన్‌ సంస్థ ఇచ్చింది. ప్రకటన చూసి నమ్మిన బాధితులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. టెలిఫోన్‌లోనే ఇంటర్వ్యూ చేసి, ఆఫర్‌ లెటర్‌ జారీచేశారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో ట్రైనింగ్‌ ఇచ్చారు. శిక్షణ అనంతరం ప్రాజెక్టు ఇస్తామంటూ బాధితులను కంపెనీ ప్రతినిధులు నమ్మించారు. ఒక్కో వ్యక్తికి రూ.4 లక్షల ప్యాకేజీని ప్రకటించారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న బాధితులు చివరకు తాము మోసపోయామని గ్రహించి మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డాన్యోన్‌ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న ప్రతాప్‌ అనే వ్యక్తి మాదాపూర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా మూడు రోజుల క్రితమే డాన్యోన్‌ కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకూ సంస్థ యాజమానిని రిమాండ్‌కు తరలించలేదని తెలంగాణ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి ఆరోపించారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఒక్కొక్కరు దాదాపు ఒకటి నుంచి రెండు లక్షల చొప్పున నగదును కంపెనీకి చెల్లించారని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్‌ న్యాయపోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement