రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 40 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈ పెట్టుబడులు 2.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ పెట్టుబడులు ముఖ్యంగా విదేశాల నుంచే ఎక్కువగా వచ్చాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ పెట్టుబడులు 2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ప్రముఖ రియాల్టి కన్సెల్టింగ్ సంస్థ అన్‌రాక్ తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంపై విదేశీ పెట్టుబడుదారులకు విశ్వాసం పెరిగిందని తెలిపింది. మొత్తం వచ్చిన పీఈ పెట్టుబడుల్లో విదేశాలకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి 78 శాతం వచ్చాయని పేర్కొంది. దేశీయ పెట్టుబడులు 45 శాతం పెరిగితే, విదేశీ పెట్టుబడులు 36 శాతం పెరిగాయి. వచ్చిన పెట్టుబడుల్లో 86 శాతం నిధులు టాప్ 10 డీల్స్లోకి వచ్చాయని వెల్లడించింది.
ప్రవేట్ ఈక్వీటీ ద్వారా వచ్చిన నిధుల్లో 1862 మిలియన్ డాలర్ల నిధులు ఆఫీస్ ఎసెట్స్లోకి వచ్చాయి. కోవిడ్ మూలంగా 2020, 2021 సంవత్సరాల్లో కార్యాలయ ఆస్తులు రంగం దారుణంగా దెబ్బతిన్నది. కోవిడ్ తరువాత ఆర్ధిక కార్యకాలాపాలు పెరగడం, ఆన్లైన్ వర్క్ బదులు, ఆఫ్‌లైన్ వర్క్‌కు కంపెనీలు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మళ్లి కార్యాలయ భవనాలుకు గిరాకీ పెరిగింది. కోవిడ్ తరువాత గృహ నిర్మాణ రంగంలోనూ మంచి పురోగతి ఉందని ఆన్‌రాక్ తెలిపింది. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లోకి 372 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రధానంగా ఎక్కువ పెట్టుబడులు ఢిల్లి, ఎన్సీఆర్ ప్రాంతాల్లో చేపట్టిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లోకి వచ్చాయి.