మన దేశ విదేశీ మారకపు నిల్వలు అక్టోబర్ 14 నాటికి రెండేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు ఆర్బీఐ తెలిపింది. విదేశీ మారకపు నిల్వలు 4.5 బిలియన్ డాలర్లు తగ్గి 528.367 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అక్టోబర్ 14కు ముందు ఈ నిల్వలు 532.868 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఆర్బీఐ వారంతపు నివేదికలో పేర్కొంది. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మన విదేశీ మారకపు నిల్వలు 34 వారాల్లో 27 వారాలు నిల్వలు తగ్గుదలను నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం నియంత్రణకు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడంతో మన దేశీయ మార్కెట్ నుంచి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో విదేశీ మారకపు నిల్వలు భారీగా తగ్గిపోవడానికి కారణమయ్యాయి.
అమెరికా వడ్డీ రేట్ల పెంపుతో దేశీయంగా కరెంట్ ఖాతా, ట్రేడ్ అకౌంట్ లోటు పెరిగిపోయింది. ఆర్ధిక మాంద్యం వస్తుందన్న భయాలతో షేర్ మార్కెట్‌లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్ ఆధారిత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. డాలర్‌తో రూపాయల మారకపు విలువ భారీగా పతనం అవుతుండటంతో దాన్ని నిలువరించేందుకు రిజర్వ్ బ్యాంక్ పెద్ద మొత్తంలో డాలర్లను ఖర్చు చేసింది. శుక్రవారం నాటికి డాలర్‌తో రూపాయి మారకపు విలువ 83.29 రూపాయలుగా ఉంది.