అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ ఫోర్ట్ మోటార్స్ భారత్‌లో వాహనాల తయారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఫోర్ట్ రెండు సంవత్సరాల క్రితం దేశంలో ఉత్పత్తిని నిలిపివేసింది. చెన్నయ్ సమీపంలో ఉన్న కంపెనీ కార్ల తయారీ ప్లాంట్ విక్రయానికి పెట్టింది. దీనిపై పలు సంస్థలతో చర్చలు కూడా జరిపింది. భారత్‌లో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్న కంపెనీ ప్రస్తుతం ఈ ప్లాంట్ విక్రయ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది.
భారత్‌లో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పలు కంపెనీలు ఎస్‌యూవీల ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఫోర్ట్ తన ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ ఎండీవర్‌తో ఇండియన్ మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. గత సంవత్సరం ఈ చెన్నయ్ ప్లాంట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ల కోసం విద్యుత్ వాహనాలను తయారీ చేయాలని కూడా భావించింది.
తాజాగా ఈ ప్రతిపాదనను కూడా ఉపసంహరించుకుంది. తాజాగా ఫోర్ట్ సీఈఓగా భారత్‌కు చెందిన కుమార్ గల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఫోర్ట్ కంపెనీ మన దేశంలో 1996లో ఎస్కార్ట్ కారుతో కార్యకలాపాలు ప్రారంభించింది. తరువాత ఐకాన్, ఫిగో, ఎకోస్పోర్ట్, ఎండీవర్ కార్లను తీసుకు వచ్చింది. ఫోర్ట్‌కు తమిళనాడు, గుజరాత్‌లో తయారీ యూనిట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు ఇక్కడి నుంచి కార్లను ఎగుమతి చేసింది.