Tuesday, November 26, 2024

అదుపులేని ధరలతో జీవితాల్లో కుదుపు..

దేశంలో టోకు ధరల సూచీ ప్రకారం లెక్కించే ద్రవ్యోల్బణం 15 శాతానికి చేరింది. గత కొద్ది మాసాలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా అత్యధిక స్థాయిలో 8 శాతం దగ్గర ఉంటూ వస్తోంది. అది ఆరు శాతం దాటడాన్ని ఆందోళనకరం గా భావిస్తారు. నిత్యావసర ధరలతో బాటు అన్ని వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడానికి రిజర్వు బ్యాంకు ఒకేసారి గణనీయయంగా రెపో రేట్‌ పెంచడంతో పాటు చలామణిలో ఉన్న నగదు నియంత్రణ చర్యలు చేపట్టింది. అయితే అది పెద్దగా ఉపశమనం కలిగించడం లేదు. కారణం ద్రవ్యోల్బణానికి వివిధ కారణాలు జతగూడడమే. అందులో అధికం ప్రపంచ స్థాయిలో ఏర్పడుతున్న పరిణామాలు కావడమే. కరోనా ప్రళయం తరువాత కొనసాగుతూ వస్తోన్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం.. వాటి వల్ల ఏర్పడుతున్న ఆర్ధిక మాంద్యం మరియు వస్తువుల సరఫరాలో ఏర్పడుతున్న అవరోధాలు. అంతేకానీ దేశంలో పెరుగుతున్న డిమాండ్‌ ముఖ్య కారణం కాదిప్పుడు. పైగా విపరీతమైన వేడిమి మూలంగా పంట దిగుబడులు, పళ్ళు, పాలు దిగుబడులు, వాటిని నిల్వ ఉంచే పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి.

గ్యాస్‌, ఇంధనం ధరలు పెరిగీ,పెరిగీ అన్ని ధరల్నీ పెంచుతూ పోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్ధిక లాభాలూ, నష్టాలూ లెక్కలు వేస్తూ కూర్చోక అన్నిరకాల పన్నుల్నీ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా పథకాల్ని రూపొందించి, నిధుల్ని ఖర్చు చెయ్యాలి. లేదంటే ఉన్న డిమాండ్‌ తగ్గిపోయి అభివృద్ధి వెనక్కిపోతుంది. కొనుగోలు శక్తి కోల్పోయిన ప్రజలు పేదలుగా మిగిలి పోతారు. పోషకాహార లేమి పెరిగి అనేక రుగ్మతలకు, మానవ వనరుల క్షీణతకు దారితీస్తుంది. దేశానికి దీర్ఘకాలికంగా నష్టపరుస్తుంది. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడానికి సత్వర చర్యలు తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement