ఆర్థిక విషయాలకు సంబంధించి చోటుచేసుకునే మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లేదంటే అనవసర ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రతినెలా కొన్ని కీలక మార్పులు జరుగుతుంటాయి. వీటిపట్ల జాగురూకతగా ఉండాలి. సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్స్, హౌసింగ్, ఐటీ రిటర్న్ వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేమిటో గమనిద్దాం..
ఐటీఆర్ పరిశీలకు ఆఖరు
ఆగస్టు 1 తర్వాత ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసిన వారు వెంటనే ఇ-వెరిఫై పూర్తిచేయాలి. ఈ గడువును ఇప్పుడు 120 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. ఆగస్టు 10న రిటర్నులు దాఖలు చేసివుంటే, సెప్టెంబర్ 9లోగా వెరిఫికేషన్ పూర్తిచేయాలి. లేదంటే మీ ఐటీఆర్‌ను పక్కనపెట్టే ప్రమాదముంది. పైగా రీఫండ్‌లోనూ జాప్యం జరిగే అవకాశంఉంది. అయితే జులై 31కి ముందు ఐటీఆర్ సమర్పించిన వారికి మాత్రం వెరిఫికేషన్ గడువుకు 120 రోజుల సమయం ఉంటుంది.
ఎన్‌పీఎస్ కమిషన్ పెంపు..
జాతీయ పింఛను పథకం (ఎన్‌పిఎస్) పరిధిలోని తమ సభ్యులు స్వచ్ఛంద పింఛను జమకు డైరెక్ట్ రెమిట్ మార్గాన్ని ఎంపిక చేసుకుంటే, పీఓపీలకు లభించే కమిషన్‌ను 0.10 శాతం నుంచి 0.20కు పెంచారు. ఈ మార్పు ఈనెల నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన మదుపరులు ఎన్‌పిఎస్ చందాదారులుగా ఉంటారు.అయితే, ఎన్‌పీఎస్‌కు, చందాదారులకు మధ్య అనుసంధాన కర్తగా పీఓపీలు ఉంటాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు పీఓపీల కిందకు వస్తాయి.
డెబిట్ కార్డు చార్జీల పెంపు..
ఈనెల నుంచి డెబిట్ కార్డు చార్జీలు,వార్షిక రుసుములు పెంచుతున్నట్లు పలు బ్యాంకులు ప్రకటించాయి. కార్డుల్లో వాడే సెమీ కండక్టర్ చిప్ ధరల పెరుగుదలే ఈ నిర్ణయానికి కారణం. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రూపే క్లాసిక్ డెబిట్ కార్డు జారీకి రూ.50 వసూలు చేయనుంది. రెండవ సంవత్సరం నుంచి వార్షిక రుసుము కింద రూ.150 వసూలుచేస్తుంది. ఇదేబాటలో యెస్ బ్యాంక్, సెంట్రల్‌బ్యాంక్‌లు చార్జీలు పెంచుతున్నాయి.
అటల్ పెన్షన్ మదుపర్లకు ఆఖరిచాన్స్..
కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్ పెన్షన్ యోజనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1నుంచి ఆదాయపన్ను చెల్లింపుదారులనూ ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తోంది. 2015లోకేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 18-40 ఏళ్ల మధ్య వయసువారు ఈ పథకంలో చేరవచ్చు. నెలకు రూ.100 నుంచి చందా కట్టవచ్చు. వీరికి 60 ఏళ్లు నిండిన తర్వాత వారు చెల్లించిన మొత్తాన్ని బట్టి రూ.1000 నుంచి రూ. 5000 దాకా పింఛను హామీ ఉంటుంది.
టోకెన్స్ రూపంలోకి కార్డులు..
పీఓఎస్, యూప్‌లలో నిక్షిప్తమైన క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను టోకెన్ రూపంలోకి మార్పుకోవాలి.అక్టోబర్ 1నుంచి కార్డు టోకనైజేషన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీ వంటికార్డు వివరాలను మర్చంట్ వెబ్‌సైట్లలో నిక్షిప్తం చేయడానికి వీలుండదు.
బీమా ప్రీమియంలో తగ్గుదల
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) కొత్త నిబంధనల ప్రకారం.. తగ్గిన ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. పాలసీదారులు ఇకపై వారి ఏజెంట్‌లకు 20శాతం కమిషన్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
పీఎన్‌బీ కేవైసీ హెచ్చరిక
కస్టమర్లు ఆగస్ట్ 31లోగా తమ కేవైసీలను పూర్తి చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది. అయితే గడువులోపు కైవైసీ పూర్తి చేయాలి. లేదంటే బ్యాంక్ ఖాతాదారులు వారి అకౌంట్‌లలో లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.